బాబు ఓటు వ్యాఖ్య వివాదాస్పదం

చెల్లని ఓటుగా పరిగణిస్తం : భన్వర్‌లాల్‌శ్రీఅలా ఏం ఉండదు : కేంద్ర ఎన్నికల కమిషన్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) :
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తాను బీజేపీకి ఓటు వేశానని ఆయన వెల్లడించడం వివాదాస్పదమైంది. ఎవరైనా ఓటు వేసిన అనంతరం దానిని బహిర్గత పరచడం సరికాదని, ఆ యన వేసిన ఓటును పరిగణనలోకి తీసుకోబోమని ఎన్నికల సం ఘం ప్రకటించింది. చంద్రబాబు ఓటును చెల్లని ఓటుగా పరిగణి స్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ వెల్లడించారు. సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిలో జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు కూడా తా ము ఏ పార్టీకి ఓటు వేసింది వెల్లడించకూడదు. అలా వెల్లడిస్తే ఆ వ్యక్తి ఓటును చెల్లని ఓటుగా పరిగణిస్తారు. అయితే, చంద్రబాబు తాను ఏ పార్టీకి ఓటు వేసింది వెల్లడించడంతో ఆయన ఓటును లెక్కలోకి తీసుకోబోమని ఆయన పేర్కొన్నారు. బుధవారం హైద రాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని గాయత్రి హిల్స్‌లో ఏర్పాటు చేసిన పోలిం గ్‌ కేంద్రంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడి యాతో మాట్లాడారు. సైకిల్‌ గుర్తుకు ఓటేయనందుకు తనకు చా లా బాధగా ఉందని తెలిపారు. పొత్తు ధర్మంలో భాగంగా రెండు ఓట్లు కూడా కమలం గుర్తుకు వేశానని చెప్పారు. తమ పార్టీ గుర్తు కు ఓటేయనందుకు బాధంగా ఉన్నప్పటికీ, పొత్తు ధర్మం కోసం బీజేపీకి ఓటు వేశానని వెల్లడించారు. టీడీపీ-బీజేపీ
పొత్తు రాష్ట్ర భవిష్యత్తను నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే, చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించారని పలువురు రిపోర్టర్లు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. రహస్య పద్ధతిలో జరిగే పోలింగ్‌లో చంద్రబాబు తన ఓటును బహిర్గతం చేయడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ను ప్రశ్నించగా బాబు ఓటును చెల్లని ఓటుగా పరిగణిస్తామన్నారు. చంద్రబాబు తన ఓటును బహిర్గతం చేయడం తప్పు అని అన్నారు. ఎవరైనా తన ఓటును బహిర్గతం చేస్తే చెల్లని ఓటుగా పరిగణిస్తామని ప్రకటించారు. ఎంతటి పెద్దవారైనా ఓటును బహిర్గతం చేయొద్దని సూచించారు. వీఐపీల నుంచి సాధారణ ఓటు వరకూ అందరూ సీక్రెసీ ఆఫ్‌ వోట్‌ను పాటించాలని కోరారు. లేకుంటే వారి ఓటును చెల్లని ఓటుగా పరిగణిస్తామన్నారు. అయితే ఎవరికి ఓటు వేశారో చెప్పినంత మాత్రాన ఓటు చెల్లుబాటుకాకుండా పోదని కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. చంద్రబాబు ఓటు చెల్లదని భన్వర్‌లాల్‌ తేల్చిచెప్పిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఈసీ దీనిపై స్పష్టత ఇచ్చింది. ఓటు వేసే సమయంలో ఎవరైనా గుర్తును బహిర్గత పరిస్తే ఆ ఓట్లు చెల్లుబాటుకాదని పేర్కొంది.