ప్రముఖ సామాజికవేత్త మల్లాది సుబ్బమ్మ ఇకలేరు


హైదరాబాద్‌, మే 15(జనంసాక్షి) :
ప్రముఖ సామాజికవేత్త, స్త్రీవాద రచయిత్రి, సారా వ్యతిరేక ఉద్యమకర్త మల్లాది సుబ్బమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 90 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మహిళాభ్యుదయం కోసం ఎంతగానో కృషిచేసిన ఆమె ఈ విషయంపై ‘మనం- మన సంస్కృతి’, విమెన్‌ అండ్‌ సోషల్‌ రిఫార్మ్స్‌ తదితర పలు పుస్తకాలు రాశారు. స్త్రీ స్వేచ్ఛ అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. హేతువాదం, కాంతికిరణాలు, చీకటివెలుగులు అనే నవలలు రాశారు. స్త్రీ విద్య ప్రాధాన్యం గురించి తొలినాళ్లనుంచీ ప్రచారం చేస్తూ వచ్చిన మల్లాది సుబ్బమ్మ తన యావదాస్తినీ యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ సహా పలు విద్యాసంస్థలకు విరాళంగా ఇచ్చేశారు. మల్లాది సుబ్బమ్మ స్వస్థలం గుంటూరు జిల్లా రేప్లలె. సారా వ్యతిరేక ఉద్యమాన్ని ముందుండి నడిపిన సుబ్బమ్మ రచయిత్రిగా సుమారు 60 పైగా రచనలు చేశారు. మల్లాది సుబ్బమ్మ 1924 ఆగస్టు 2న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంకలో జన్మించారు. బాపట్లకు చెందిన ఎం.వి.రామమూర్తిని ఆమె వివాహం చేసుకున్నారు. అత్తమామలు వ్యతిరేకించినప్పటికీ భర్త సహకారంతో పెళ్లైన తర్వాత ఉన్నత విద్యను అభ్యసించారు. 60పైగా రచనలు చేశారు. మల్లాది సుబ్బమ్మ మరణం పట్ల కవులు, రచయితలు సంతాపం ప్రకటించారు. మల్లాది సుబ్బమ్మ మరణం తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు.