తెలంగాణ ఉద్యమంలో ‘ఘంటా’ది జైత్రయాత్ర


పుస్తకావిష్కరణలో వక్తల ఉవాచ
హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమంలో ‘ఘంటా’ది జైత్రయాత్ర అని, ప్రజల ఆ కాంక్షల ప్రతిరూపం ఆయన జైత్రయాత్ర అని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ చెన్నమనేని హన్మంతరావు అన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి రచించిన ‘తెలంగాణ జైత్రయాత్ర’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. బొగ్గులకుం టలోని సారస్వత పరిషత్‌ హాల్‌లో ఆదివారంసాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మంతరావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో అనేక రూపాలుగా అన్యాయానికి గురైందని, ఆర్థిక రంగంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కొందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌ కేటాయింపులు అంకెల గారడీగానే మిగిలిపోయాయని, నిధుల కేటాయింపులో తీవ్రమైన వివక్షకు ప్రతిగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పెల్లుబికిందని అన్నారు. టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ ప్రజల తపనకు ఘంటా చక్రపాణి అక్షరరూపం ఇచ్చారని అన్నారు. రాజకీయ పార్టీల దోబూచులాటలు, అవకాశవాద ఆటలు కళ్లకు కట్టారని కొనియాడారు. తెలంగాణలో 2019కు ముందే ఎన్నికలు వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనడం ఆయన దురంహకారానికి నిదర్శనమని అన్నారు. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల పక్షాన తాను స్పందిస్తూనే ఉంటానని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో చేపట్టాల్సిన కీలకాంశాలపై తన ఘంటాపథంలో గత ఆరేడు వారాలుగా రాస్తున్నానని వివరించారు. ప్రజల పక్షాన స్పందించడం, వారి ఆకాంక్షలను చెప్పడం తన బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు రమా మేల్కోటే, వీఎస్‌ ప్రసాద్‌, సంపాదకులు కె. శ్రీనివాస్‌, అల్లం నారాయణ, కందాడి బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.