చెన్నయ్ : ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సేను ఆహ్వానించడంపట్ల ఎండిఎంకె అధినేత వైగో అభ్యంతరం తెలిపారు. “చరిత్రాత్మకమైన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి మహా పాపాత్ముడు రాజపక్సేను ఆహ్వానించారనే వార్త పిడుగుపాటులా వచ్చింది” అని వైగో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. “1998, 1999 సంవత్సరాల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి అలాగే 2004, 2009 సంవత్సరాల్లో యుపిఎ ప్రభుత్వాల ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుని ఆహ్వానించలేదనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాను. అగ్గిలో ఆజ్యం పోస్తున్నట్లుగా విదేశీ వ్యవహారాల మంత్రిగా బిజెపి సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. శ్రీలంకలో అక్కడి తమిళుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలను సందర్శించడానికి వెళ్ళిన ఎంపీల బృందంలో సుష్మా స్వరాజ్ ఉన్నారు. ఆ సమయంలో ఆమె తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు” అని వైగో తన ప్రకటనలో ఎన్డీయే నాయకులకు గుర్తు చేశారు.