తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు..‘‘తెలంగాణ‌’’ కోసం ఎదురుచూపు

హైదరాబాద్ (ఏజెన్సీస్): జూన్ 2న ఆవిర్భవించనున్న తెలంగాణ రాష్ట్రానికి కొత్త వాహన రిజిస్ట్రేషన్ కోడ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ న్యూఢిల్లీలో బాధ్యతలు చేపట్టనున్న కొత్త ప్రభుత్వం వచ్చే వారం విడుదల చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన దరిమిలా దేశంలోని 29వ రాష్ట్రంగా అవతరించనున్న తెలంగాణ కోసం ‘‘టిజి’’(TG) సిరీస్‌ని కేటాయించాలని కోరుతూ సంబంధిత మంత్రిత్వశాఖకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిపాదన పంపింది.‘‘ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ప్రతిపాదనలు అందాయి. తెలంగాణకు కొత్త వాహన రిజిస్ట్రేషన్ కోడ్‌ను కేటాయించడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయితే కొన్ని విధానపరమైన నిబంధనలు పాటించాల్సి ఉన్నందున వచ్చేవారం నోటిఫికేషన్ వెలువడవచ్చు’’ అని రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖకు చెందిన వర్గాలు బుధవారం నాడిక్కడవెల్లడించాయి.ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రవాణా కమిషనర్ జి. అనంతరామును సంప్రదించగా, మంత్రిత్వశాఖ నుంచి నోటిఫికేషన్ జూన్ 1న వచ్చినప్పటికీ జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.తెలంగాణ ప్రాంతంలో వాహనాల రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండాఉండేందుకు జూన్ 2 తర్వాతే తమ వాహనాలను రిజిస్టర్ చేయించాలని కొనుగోలుదారులు భావించడమే దీనికి కారణమని ఆ అధికారి చెప్పారు.ఇక పాత వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లు మార్పు విషయమై తెలంగాణలో జూన్ 2న ఏర్పడే ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంటుంది. పాత వాహనాలు కూడా తమ రిజిస్ట్రేషన్ నంబర్లు మార్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన పక్షంలో ‘‘ఎపి’’(AP) సిరీస్‌తో తెలంగాణలో తిరుగుతున్న వాహనాలన్నీ కూడా కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ పొందాల్సిందేనని ఆ అధికారి తెలిపారు.‘‘జూన్ 2 నుంచి కొత్త వాహనాలకు కొత్త రాష్ట్రం కోడ్ వస్తుంది. కొత్త సిరీస్‌కు తమ వాహనాల రిజిస్ట్రేషన్‌ను మార్చుకోవలసి వస్తే పాత వాహనాల యజమానులు ఎటువంటి రోడ్డు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కొంత నామమాత్రపు ఫీజు ఉంటుంది. కొత్త సిరీస్‌కు మారడానికి తగినంత వ్యవధిని కూడా ఇవ్వడం జరుగుతుంది’’ అని ఆ అధికారి వివరించారు.ప్రస్తుతం అమలులో ఉన్న నియమనిబంధనల ప్రకారం వాహన యజమానులు ప్రస్తుత సిరీస్‌నే కొనసాగించవచ్చు. వాహనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న నాటి నుంచి 15 ఏళ్ల తర్వాత తమ రిజిస్ట్రేషన్‌ను రెన్యూవల్ చేసుకున్నప్పుడు సిరీస్‌ను మార్చుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన వాహనాల వివరాలతో కూడిన సెంట్రలైజ్డ్ డాటాబేస్ హైదరాబాద్‌లో ఉంది. వాహనం ఏ జిల్లాలో రిజిస్టర్ అయిందో దాన్ని విడిగా కేటాయించే సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంది. రెండు రాష్ట్రాల డాటాబేస్‌ను కొంతకాలం ఉంచేందుకు ప్రస్తుత సర్వర్‌ను రెండు భాగాలుగా విభజించారు.‘‘భవిష్యత్తులో సర్వర్‌కు ఏదైనా సమస్య వస్తే రెండు రాష్ట్రాలలో వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే దాన్ని రెండు వేర్వేరు సర్వర్లుగా ఉంచడం అవసరం’’ అని ఆ ప్రభుత్వ అధికారి తెలిపారు.తెలంగాణలో ‘‘ఎపి’’(AP) సిరీస్‌తో దాదాపు 70 లక్షల వాహనాలు తిరుగుతున్నాయని అయన చెప్పారు.