తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి సహకరించండి


పోలవరం డిజైన్‌ మార్చాల్సిందే
రిటైర్డ్‌ ఇంజినీర్లతో కేసీఆర్‌ భేటీ
హైదరాబాద్‌, మే 25 (జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సహకరించాలంటూ టీఆర్‌ఎస్‌ అధినేత, ఈ రాష్ట్రానికి కాబోయే
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సాగునీటిరంగ నిపుణులను కోరారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో సాగునీటి పారుదల శాఖ రిటైర్డు ఇంజినీర్లు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ తెలంగాణలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కోరారు. నిధులు తాను తీసుకువస్తానని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, మిగతా పనులు మీరు పూర్తి చేయాలంటూ వారికి సూచించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో రిటైర్డ్‌ ఉద్యోగులు, ఇంజినీర్ల సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. తాగు, సాటునీటి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే 80 శాతం నిర్మించి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అడిగి తెలుసుకున్నారు. జులై 11ను ఇంజినీరింగ్‌ డేగా ప్రకటించాలని ఈ సందర్భంగా ఇంజినీర్ల బృందం సభ్యులు కేసీఆర్‌ను కోరారు. ఈ భేటీ సీడబ్ల్యూసీ రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ ఆర్‌. విద్యాసాగర్‌రావు, టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె. కేశవరావు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.