జగన్‌కు షాక్‌


జారుకుంటున్న సీమాంధ్ర నేతలు
హైదరాబాద్‌, మే 25 (జనంసాక్షి) :వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డికి సొంత పార్టీ నేతలు షాక్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావాలని ఎంతో తీవ్రంగా
ప్రయత్నించిన జగన్‌కు ప్రజలు మొండిచేయి చూపారు. తెలంగాణలో నష్టపోయినా ఇబ్బందేమీలేదని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆయన తొలి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అయితే సీమాంధ్రలో జగన్‌ అధికారంలోకి వస్తారనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. అయితే ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు తిరస్కరించారు. కేవలం 67 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. అయితే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలు పక్కదారి చూస్తున్నారు. ఆ పార్టీ రిజిష్టర్డ్‌ పార్టీ అయినందునా ఆ పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు మరో పార్టీలోకి జంప్‌ చేసినా అనర్హత వేటు పడదనే నమ్మకానికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీ వైపు చూస్తున్నారు. తెలంగాణలో ఆ పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం కొనసాగింది. ఇదిలా ఉండగా, సీమాంధ్ర ప్రాంతం అదీ జగన్‌కు గట్టి పట్టున్న రాయలసీమకు చెందిన కర్నూలు జిల్లాలోని ఇద్దరు ఎంపీలు టీడీపీలో చేరిపోయారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆదివారం ఢిల్లీలో చంద్రబాబును కలిసి పార్టీ తీర్థం పుచ్చుకోగా, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠం చంద్రబాబును కలిశారు. వారితో చర్చలు కొనసాగుతున్నాయి. ఆమె సైతం టీడీపీలో చేరేందుకు దాదాపు సిద్ధమైనట్టు సమాచారం. ఆమె కాకుండా కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. కర్నూలు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు టీజీ వెంకటేశ్‌ ఈ మేరకు వారితో చర్చలు జరుపుతున్నారు. తాను టీజీ వెంకటేశ్‌ మధ్యవర్థిత్వంలోనే టీడీపీలో చేరినట్టు ఎస్పీవై రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఎస్పీవై రెడ్డి తర్వాత బుట్టా రేణుక కూడా టీడీపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. అయితే వైఎస్సార్‌ సీపీకి విప్‌ వర్తిస్తుందని, ఆ పార్టీ రిజిస్టర్డ్‌ పార్టీ అయినా ఆ పార్టీ పక్షాన గెలిచిన వారు మరో పార్టీలో చేరితే అనర్హత వేటు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఈసీ సంపత్‌ సహా కేంద్ర ఎన్నికల అధికారి హెచ్‌ఎస్‌ బ్రహ్మ తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని రాజ్యాంగ నిపుణులు సైతం ధ్రువీకరించడంతో సోమవారం సాయంత్రం చంద్రబాబుతో భేటీ అయిన బుట్టా రేణుక తాను టీడీపీలో చేరబోవడం లేదన్నారు.
జగన్‌తో ఎలాంటి విభేదాలు లేవు: ఎస్పీవై రెడ్డి
జగన్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీలో సైతం తనకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఎస్పీవై రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. బుట్టా రేణుకాతో సైతం తాను చర్చలు కొనసాగిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి కోరుకునే వారు టీడీపీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.
వైకాపా ఎంపీలను టీడీపీలో చేర్చుకోవడం అనైతికం : మేకపాట
తమ పార్టీకి చెందిన ఎంపీలను టిడిపిలో చేర్చుకోవడం అనైతిక చర్యగా వైకాపా నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మా పార్టీ ఎంపీలను చంద్రబాబు అన్యాయంగా లాక్కున్నారని ఆయన విమర్శించారు. ఫలితాలు వెలువడి పట్టుమని పది రోజులు కాకముందే వారు పార్టీ మారడం సరైన చర్య కాదన్నారు. అలాగే కనీసం వారు ఎంపిలుగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదన్నారు. పార్టీలు మారాల్సి వస్తే ఎంపి పదవికి రాజీనామాచేసి మారి ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదన్నారు. తాను కూడా ఒకప్పుడు పార్టీని మారిన వాడినేనని, కానీ ఎంపీ పదవికి రాజీనామాచేసి పార్టీ మారిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పార్టీ మారిన వారిపై వేటు తప్పదన్నారు. కాగా, ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళితే ఆ వ్యక్తి అనర్హుడవుతాడని పార్టీ సలహాదారు సోమయాజులు తెలిపారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు తప్పదన్నారు. చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. తమ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లేదని స్వతంత్ర పార్టీగానే గుర్తిస్తారని టిడిపి సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను సోమయాజులు ఖండించారు. ఎన్నికల్లో పోలైన ఓటింగ్‌ శాతాన్ని బట్టి వైకాపాకు ఇసి గుర్తింపు వచ్చే అవకాశం ఉందని యనమల విషయాన్ని ఈ సందర్భంగా సోమయాజులు గుర్తుచేశారు.