సరిహద్దులు మారిస్తే అప్రజాస్వామికమే: కేసీఆర్
పోలవరం డిజైన్ మార్చాల్సిందే : కేసీఆర్
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రాంతాన్ని ముంచుతున్న పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాల్సిందేనని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టుపై తమకు వ్యతిరేకత లేదని… డిజైన్‌ను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పోలవరం ద్వారా ఆంధ్రాకు పోయే నీటిని తాము ఆపబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలవరం కడుతున్న ప్రాంతంలో భూకంపాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు సూచించారని గుర్తు చేశారు. ఇప్పటికే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు పోలవరాన్ని వ్యతిరేకిస్తున్నాయి… తాము కూడా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే పోలవరంపై ఆర్డినెన్స్‌ను తీసుకురావొద్దని ప్రధాని నరేంద్రమోడీని కోరామని తెలిపారు. పోలవరంపై ఆదరబాదర నిర్ణయాలు తీసుకోవద్దని కేసీఆర్ చెప్పారు. ఒక వేళ ఆర్డినెన్స్‌ను తీసుకువస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. పోలవరంపై హోంశాఖ తయారు చేసిన ఆర్డినెన్స్‌ను తాను తీవ్రంగా వ్యతిరేకించానని తెలిపారు. రాష్ట్ర విభజన రాష్ట్రపతి సంతకంతో చట్టబద్దమైందని చెప్పారు. రెండు రాష్ర్టాల సరిహద్దులు మార్పులు చేయాలంటే ఆర్టికల్ -3 ప్రకారం సవరణలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలపడం సరికాదన్నారు.
బాబు వార్‌రూమ్‌కు వస్తే అభ్యంతరం లేదు : కేసీఆర్
ఉద్యోగుల విభజనలో జరుగుతున్న అక్రమాలను ఆరికట్టడానికి మాత్రమే వార్‌రూమ్‌ను ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు. వార్‌రూమ్ అంటే సమాచార కేంద్రమే అని స్పష్టం చేశారు. వార్‌రూమ్‌కు చంద్రబాబు వస్తే అభ్యంతరం లేదన్నారు. వార్‌రూమ్ అర్థం బాబుకు తెలియకపోతే తాను ఏం చేయలేనని చెప్పారు.