మోడీ, షరీఫ్‌ ద్వైపాక్షిక చర్చలు

modibbb
ఉగ్రవాదాన్ని అంతం చేద్దాం
ముంబై పేలుళ్ల పురోగతిపై అసంతృప్తి : మోడీ
ఇదో కొత్త అధ్యాయం
సుహృద్భావ వాతావరణంలో చర్చలు
కలహాలు వద్దు.. కలిసి ముందుకెళ్దాం : నవాజ్‌ షరీఫ్‌
మోడీ, షరీఫ్‌ ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ, మే 27 (జనంసాక్షి) :
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్రమోడీ ఉపఖండంలో శాంతికోసం తన ప్రయత్నాలను మొదలు పెట్టారు. మంగళవారం పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో ఆయన హైదరాబాద్‌ హౌస్‌లో భేటీ అయ్యారు. ఉగ్రవా దంపై పాకిస్తాన్‌ కఠిన చర్యలు తీసుకోవాలని భారత్‌ స్పష్టం చేసింది. ఉప ఖండంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు పరస్పరం సహకరిం చుకుందామని హితవు పలికింది. ముంబై పేలుళ్లపై పాకిస్తాన్‌లో విచారణ మందకొడిగా సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిహద్దుల వద్ద కాల్పుల ఉల్లంఘన, ముంబై పేలుళ్లను తీవ్రంగా ఖండించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారి, శాంతియుత వాతావ రణం ఏర్పడాలని ఆకాంక్షించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వ రాజ్‌, విదేశాంగ కార్యదర్శి సుజాత్‌సింగ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 50 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య సంబంధాలు, ఉగ్రవాద నిర్మూలన, ముంబై పేలుళ్ల విచారణ వంటి ఐదు అంశాల అజెం డాతో ఈ సమావేశం జరిగింది. ఉగ్రవాద దాడులు జరగకుండా చూడాలన్న అంశానికి తొలి ప్రాధాన్యమిచ్చారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, సత్సంబంధాలను పునరుద్ధరించుకోవాలని ఇరువురు నేతలు ఆకాం క్షించారు. పాకిస్తాన్‌లో పర్యటించాలని షరీఫ్‌ ఈ సందర్భంగా మోడీని మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు సమాచారం.అంతకు ముందు మోడీ పాక్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. 2008 ముంబై ఉగ్ర వాద దాడుల కేసుల విచారణ నత్తనడకన సాగుతోందని ఇంతవరకు ఎవరి పై ఎలాంటి చర్యలు తీసుకోని అంశాన్ని మోడీ షరీఫ్‌ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ముంబై పేలుళ్లపై పాక్‌ విచారణ మందకొడిగా సాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేసిన మోడీ సరిహద్దుల వద్ద పాక్‌ బలగాలు తరచూ భారత్‌పైకి కాల్పులకు పాల్పడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసు కొచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు తెగబ డడంపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో దాడులను ఆపాలని షరీఫ్‌ను కోరినట్లు తెలిసింది. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేద్దామని కోరారు. ఉపఖండంలో ఉగ్రవాద అంతానికి సహకరించుకుందామన్నారు. ఇరు దేశాల్లో ఉగ్రవాద దాడులు ఆగిపోవాలి. ఉగ్రవాద నిర్మూలనకు పరస్పర సహకారంతో పని చేద్దామమన్నారు. దీనిపై షరీఫ్‌ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అఫ్ఘానిస్తాన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడి అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై కూడా ఇరువురు చర్చించారు. మోడీతో భేటీ ముగిసిన అనంతరం నవాజ్‌ షరీఫ్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మాజీ ప్రధాని అటల్‌ బీహరీ వాజ్‌పేయిను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకు ముందు షరీఫ్‌ ఢిల్లీలోని చారిత్రక ప్రాంతాలను సందర్శించారు. పురాతన జామియా మసీదు, ఎర్రకోట తదితర ప్రాంతాలను సందర్శించారు. భారత్‌ పాక్‌ దేశాల మధ్య సరికొత్త అధ్యాయం ప్రారంభమయ్యిందని పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అన్నారు. మోడీ ప్రభుత్వానికి ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య భవిష్యత్తులో మంచి సంబంధాలు నెలకొనాలని ఆయన అభిలషించారు. మోడీ ఆహ్వానంపై ఢిల్లీ రావడం చాలా ఆనందంగా ఉందన్న ఆయన మోడీతో తన సమావేశం సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు. భారత్‌, పాక్‌ సంబంధాల బలోపేతంలో కొత్త అధ్యాయానికి నాంది పలికామన్నారు. భారత్‌, పాక్‌లు ఇకనైనా అపనమ్మకాలను అధిగమించాలన్నారు. శాంతి, స్థిరత్వం లేకుండా ఉమ్మడి లక్ష్యాలను చేరుకోలేమని, ఇరుదేశాల సఖ్యతతోనే ఇది సాధ్యమని నవాజ్‌షరీఫ్‌ పేర్కొన్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై త్వరలో విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీ జరుగుతుందని నవాజ్‌ షరీఫ్‌ తెలిపారు. మోడీతో భేటీ ముగిసిన అనంతరం షరీఫ్‌ విూడియాతో మాట్లాడారు. మోడీతో సమావేశం సహృద్భావ వాతావరణంలో జరిగిందని పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు. భవిష్యత్‌లో రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొనాలని ఆయన కాంక్షించారు. భారత్‌, పాకిస్థాన్‌లు ఇకనైనా అపనమ్మకాలను అధిగమించాలని కోరారు. శాంతి, స్థిరత్వం లేకుండా ఉమ్మడి లక్ష్యాలను చేరుకోలేమని చెప్పారు. ఇరుదేశాల సఖ్యతతోనే ఇది సాధ్యమన్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై త్వరలో విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీ జరుగనుందని, ఇరు దేశాల ఎజెండా ఆర్థికాభివృద్ధియేనని స్పష్టం చేశారు. 50 నిమిషాలపాటు సాగిన ఈ చర్చల్లో సరిహద్దువద్ద కాల్పుల ఉల్లంఘన, ముంబయి ఉగ్రవాద దాడులను మోడీ తీవ్రంగా ఖండించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా హాజరయ్యారు. అయిదు అంశాల అజెండాతో ఈ సమావేశం కొనసాగింది. ఉగ్రవాద దాడులు జరగకుండా చూడడం అన్న అంశానికి తొలిప్రాధాన్యమిచ్చారు. 2008లో ముంబయి ఉగ్రవాద దాడుల కేసుల విచారణ నత్తనడకన సాగుతోందని ఇంతవరకు ఎవరిపై ఎలాంటి చర్యా తీసుకోలేదన్న అంశాన్ని మోడీ షరీఫ్‌ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ఉగ్రవాద నిర్మూలనకు పరస్పర సహకారం అవసరమని మోడీ అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడి అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై కూడా ఇరుదేశాల ప్రధానులూ చర్చించారు. మోడీతో సమావేశం అనంతరం నవాజ్‌ షరీఫ్‌ మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయితో సమావేశమయ్యారు.
తీవ్రవాద నియంత్రణపైనే చర్చలు
భారత ప్రధాని మోడీ, పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ల మధ్య జరిగిన చర్చల సారాంశంపై భారత్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌ విడుదల చేసిన ప్రకటనలోని సారాంశం… ‘తీవ్రవాదం నియంత్రణపైనే రెండు దేశాలు చర్చించాయి. తీవ్రవాదంపై మన దేశ ఆందోళనను మోడీ పాక్‌కు తెలిపారు. తీవ్రవాద నియంత్రణకు పాకిస్థాన్‌ గట్టి చర్యలు తీసుకోవాలని మోడీ కోరారు. ముంబయి దాడుల కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు. ద్వైపాక్షిక వాణిజ్యంపై మోడీ, నవాజ్‌ చర్చలు జరిపారు.’
కొలువుదీరిన మంత్రులు
నివాళులర్పించారు. మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించాక మోడీ నెహ్రుకు శ్రద్ధాంజలి ఘటించారు. స్వతంత్ర భారత దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూకు కొత్తప్రధాని నరేంద్రమోడీ నివాళులు అర్పించారు. పండిట్‌ నెహ్రూ 50వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి తన విధుల్లో పాల్గొన్నారు. అలాగే, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటం వద్ద కూడా ఆయన నివాళులు అర్పించారు. తన కార్యాలయంలో పెట్టుకున్న గాంధీ చిత్రపటం వద్ద పూలు ఉంచి నమస్కరించారు. నెహ్రూకు నివాళులు అర్పించిన విషయాన్ని తన ట్విట్టర్లో కూడా పేర్కొన్నారు. మాజీప్రధాని మన్మోహన్‌ను ప్రధాని మోడీ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. మన్మోహన్‌ నివాసానికి వెళ్లి కలిశారు. మన్మోహన్‌ దంపతులు మోడీకి సాదరస్వాగతం పలికారు. కాసేపు ముచ్చటించి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఇక ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా నరేంద్రమోడీ బస అధికార నివాసానికి ఇప్పట్లో మారే అవకాశం కన్పించడం లేదు. ఆయన మరికొద్ది రోజులవరకూ గుజరాత్‌ భవన్‌లోనే బసచేయనున్నారు. మే 20న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటినుంచి మోడీ గుజరాత్‌ భవన్‌లోనే ఉంటున్నారు. ప్రధాని అధికారిక నివాసాన్ని మన్మోహన్‌సింగ్‌ సోమవారమే ఖాళీ చేశారు. అయితే అందులో మరమ్మతులు చేయాల్సి ఉన్నందున మే 30 వ తేదీలోగా మోడీ అందులోకి మారే అవకాశం లేదు. రేస్‌కోర్స్‌ రోడ్‌లోని నంబర్‌ 7 భవంతికి బదులుగా మోడీ నంబర్‌ 5 భవంతిని అధికారిక నివాసంగా మార్చుకోనున్నట్లు సమాచారం. మన్మోహన్‌సింగ్‌ దీనిని తన కార్యాలయంగా ఉపయోగించారు.
కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పలువురు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్రమోడీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని, భారత అభివృద్ధికి బాటలు వేస్తామని ఉద్ఘాటించారు. మంత్రులు అరుణ్‌ జైట్లీ, సదానందగౌడ, గోపీనాథ్‌ముండే, అశోక్‌గజపతిరాజు, హర్‌సిమ్రత్‌కౌర్‌ తదితరులు బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్‌జైట్లీ బాధ్యతలు చేపట్టారు. నార్త్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. దేశం సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో బాధ్యతలు స్వీకరించామన్న జైట్లీ ప్రస్తుత సమయం ఎంతో కీలకమైనదని, ఆర్థిక మంత్రి పదవి ఇప్పుడు ఒక సవాలు వంటిదని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి, వృద్ధి రేటు గాడిలో పెట్టాల్సి ఉందన్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లలో సమతుల్యం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం అదుపునకు, ఆర్థిక స్థిరీకణకు తన తొలి ప్రాధాన్యమని చెప్పారు. కీలకమైన ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాలతో పాటు రక్షణ శాఖను అప్పగించడంపై విలేకరులు ప్రశ్నించగా ఈ బాధ్యతలు తాత్కాలికమేనని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత రక్షణ శాఖకు పూర్తి స్థాయి మంత్రిని నియమించనున్నట్లు వెల్లడించారు. మోడీ మంత్రివర్గంలో సుష్మాస్వరాజ్‌ అత్యంత కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖను దక్కించుకున్నారు. ఈ శాఖను చేపట్టనున్న మొట్టమొదటి మహిళా మంత్రి ఈమె కావడం గమనార్హం.
ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యం : సదానంద
ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతనిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి డీవీ సదానందగౌడ తెలిపారు. మంగళవారం ఆయన రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విూడియాతో మాట్లాడారు. గోరఖ్‌పూర్‌ రైలు ప్రమాదం నేపథ్యంలో బాద్యతలు చేపట్టిన ఆయన భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. రైల్వే శాఖలో ఎన్నో సవాళ్లు ముందున్నాయని, కానీ, ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చడమే ప్రథమ కర్తవ్యమని తెలిపారు. సవాళ్లను అధిగమించి మెరుగైన సౌకర్యాలు అందిస్తామని చెప్పారు. ప్రధాని మోడీతో చర్చించి నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటామన్నారు. బుల్లెట్‌ రైళ్ల కలను ఆచరణసాధ్యం చేస్తారా? అని ప్రశ్నించగా దీనిపై ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో మోడీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ అంశంపై ఆయనతో చర్చిస్తానన్నారు.