ముండే షాక్‌తోనే పోయారా?

 

న్యూఢిల్లీ :  శరీరంలో ఒక్క గాయం కూడా లేదు. వ్రయాణిస్తున్న కారుకు పెద్దగా ప్రమాదం జరగలేదు. అయినా ఇటీవలే కేంద్ర మంత్రివర్గంలో చేరిన గోపీనాథ్ ముండే ప్రమాదం జరిగిన కాస్సేపటికే కన్నుమూసిన ఘటన దేశానికి షాక్ కలిగించింది. ప్రమాద ప్రభావం వల్ల కలిగిన షాక్ కారణంగానే ఆయన మృతి చెందారని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించడంతో భారతీయ జనతాపార్టీ వర్గాలు, కేంద్ర మంత్రి వర్గ సభ్యులు తీవ్ర విచారంలో మునిగిపోయారు.
దేశరాజధాని నడిబొడ్డులోని పృథ్వీరాజ్ రోడ్- తుగ్లక్ రోడ్ మలుపులో మంగళవారం ఉదయం గం.6.30 లకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే  ప్రయాణిస్తున్న కారు మరొక కారును ఢీకొన్నదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తక్షణం ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా గం.7.50ల సమయంలో ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు. ముండేకు ఎలాంటి గాయాలు తగల్లేదని కాని ఆ ప్రమాద వ్రభావంతో షాక్‌కు గురై ఆయన మృతి చెంది ఉండవచ్చని వైద్యులు నిర్ధారించారు. ఢిల్లీనుంచి ముంబయ్ వెళ్లడానికి బయలు దేరిన మంత్రి మార్గమధ్యంలోనే అనుకోని ప్రమాదంలో చిక్కుకుని కన్నుమూశారు.
ఎలా జరిగింది? 

రాజధానిలో మంగళవారం ఉదయం శరవేగంగా వెళుతున్న కాన్వాయ్ లోని కేంద్రమంత్రి ముండే కారు తుగ్లక్ రోడ్డు మలుపులో మరొక కారును ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన తర్వాత కూడా స్పృహలోనే ఉన్న మంత్రి తన కారు ముందు సీటులో కూర్చుని ఉన్న అంగరక్షకుడిని నీళ్లు అడిగారని తెలుస్తోంది. తర్వాత తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆదేశించారు. తన వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ ఆయనను వెంటనే ఎయిమ్స్ ట్రూమా సెంటర్‌కి తీసుకెళ్లారు. ఆసుపత్రికి వచ్చిన సమయానికి ఆయనకు నాడి కొట్టుకోవడం లేదని, రక్తపోటు లేదని వైద్యులు చెప్పారు. ఆయన గుండె పనిచేయడం లేదని వైద్యులు గుర్తించారు. వైద్యులు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన షాక్ నుంచి కోలుకోలేకపోయారని ఎయిమ్స్ ప్రకటించింది.
సౌమ్యుడు, నిజాయితీపరుడు అయిన ముండేను ప్రదాని నరేంద్రమోడీ ఏరి కోరి తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. వారం రోజులు గడవకముందే ఆయన అర్థాంతరంగా తనువు చాలించడం పార్టీవర్గాలను కలిచివేస్తోంది. గోపీనాథ్ ముండే భౌతికకాయానికి బుధవారం లాతూర్ లోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రధాని ప్రగాఢ సంతాపం
కారువ్రమాందంలో అనూహ్యంగా మరణించిన కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే నిజమైన ప్రజానేత అని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ముండే ఆకస్మిక మృతి తనను విషాదంలో ముంచెత్తిందని, దిగ్భ్రాంతి కలిగించిందని మోడీ అన్నారు. ఒక చురుకైన నేతను ఇలా కోల్పోవడం పార్టీకి పెద్ద నష్టమని, ఆయన లేని లోటును పూరించలేమని మోడీ ట్వీట్‌ చేశారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చిన ముండే తన రాజకీయ జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోపించారని, నిరంతరాయంగా ప్రజలకు సేవలందించారని మోడీ కొనియాడారు. నా మిత్రుడు, సహచరుడు గోపీనాథ్ ముండే ఆకస్మిక మృతితో తీవ్రంగా విచారిస్తున్నాను. ఆయన మృతి దేశానికి, కేంద్రప్రభుత్వానికి పెద్దలోటు అని మోడీ సంతాపం తెలిపారు.
Topics: కేంద్రమంత్రి, గోపీనాథ్ ముండే, కారుప్రమాదం, కాన్వాయ్, షాక్, గుండెపోటు, ఎయిమ్స్, కన్నుమూత, బీజేపీ, నరేంద్రమోడీ, ప్రభుత్వం, సౌమ్యూడు, క్రియాశీల నేత.