ఎవరెస్టు తెలంగాణ తేజాలకు నీరా’జనం’
సాహస బాలలకు తలవంచి
స్వాగతం పలికిన చార్మినార్
ఇది ఆరంభమే
మా పిల్లలను ఆల్‌రౌండర్స్ చేస్తాం
తెలంగాణ రాష్ట్రంలో జాతినే తీర్చిదిద్దుతాం
నేడు సీఎం కేసీఆర్‌ను కలుస్తాం
డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, జూన్ 8 (జనంసాక్షి) :
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసిన తెలంగాణ తేజాలు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. గుర్రపుబగ్గీలో నగరానికి తీసుకువచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారికి తెలంగాణ ప్రజలు నిరాజనాలు పలుకుతూ భారీ స్వాగత ర్యాలీ నిర్వహించారు. సాహస బాలలకు తలవంచి స్వాగతం పలికింది హైదరాబాద్ షాన్ చార్మినార్. దక్షిణ మండల డీసీపీ బాబూరావు నేతృత్వంలో పోలీసులు వారిని ఘనంగా సత్కరించారు. అలాగే వివిధ స్వచ్ఛంద సంఘాల బాధ్యులు పూర్ణ, ఆనంద్‌లను సత్కరించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీతో వారికి స్వాగతం పలికారు. చార్మినార్ వద్ద జాతీయ జెండాతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పూర్ణ, ఆనంద్ మాట్లాడుతూ ఐపీఎస్ అధికారులు కావడమే తమ లక్ష్యమని తెలిపారు. తాము ఎవరెస్టు శిఖరం అధిరోహించడానికి ఐపీఎస్ అధికారి, సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమారే స్ఫూర్తి అని చెప్పారు. తమకు సాయం చేసిన గురువులందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. తాము భారతీయులమైనందుకు గర్వపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల చీఫ్ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందిస్తూ ఇది ఆరంభం మాత్రమేనని తెలిపారు. తమ విద్యాసంస్థల్లోని పిల్లలను ఆల్ రౌండర్స్‌గా తీర్చిదిద్దామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ జాతినే నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఎవరెస్టు అధిరోహకులు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తామని చెప్పారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల కన్నా మెరుగైన రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దుతామని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపడమే తమ ధ్యేయమన్నారు. గురుకుల విద్యాసంస్థలు సాధించిన విజయంతో సంతృప్తిపడబోమని, భవిష్యత్తులో తెలంగాణ సమాజంతో గర్వంతో తలఎత్తుకునేలా మంచి ఫలితాలు సాధిస్తామని, అన్ని రంగాల్లో మెరుగైన నైపుణ్యతలు గల విద్యార్థుల తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.