కులమత సరిహద్దుల్ని చెరిపేశారు
సుస్థిర ప్రభుత్వాన్ని అందించారు
అందరికి తోడు.. అందరి వికాసమే లక్ష్యం
ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
తొలినాడే జై తెలంగాణ
పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించిన టీ సభ్యులు
న్యూఢిల్లీ, మే 9 (జనంసాక్షి) :దేశప్రజలు కులమతాల సరిహద్దుల్ని చెరిపేశారని, దేశాభివృద్ధే ధ్యేయంగా సుస్థిర ప్రభు త్వాన్ని ఏర్పాటు చేశారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్ర భుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ప్రకటించారు. ప్రజల ఆకాం క్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. అందరి తో డుగా.. అందరి అభివృద్ధి కోసం
(సబ్‌కా సాథ్.. సబ్ కా వికాస్) అన్నదే తమ ప్రభుత్వ విధానమని అందరి సంక్షేమానికి పాటుపడతామని తెలిపారు. సంఘటిత అభివృద్ధి, ఉపాధి కల్పనకు కృషి చేస్తూ పేదరికాన్ని నిర్మూలిస్తామని తెలిపారు. 2020 కల్లా అందరికీ ఇళ్లు, 24 గంటల విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామన్నారు. ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు చర్యలు చేపడతామని, నల్లధనం సమస్యను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. తీవ్రవాద నిర్మూలణ, అంతర్గత భద్రత, విదేశాలతో సత్సంబంధాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని నివారణకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తామన్నారు. సామాజిక, ఆరోగ్య, మౌళిక రంగాల్లో వినూత్న చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు. హింసాత్మక ఘటనలకు తావివ్వకుండా ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన వ్యక్తం చేసిన ప్రణబ్.. వారికి అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తామని తెలిపారు. దేశాన్ని ‘బ్రాండ్ ఇండియా’గా రూపొందిస్తామని ప్రకటించారు. ట్రెడిషన్, టాలెంట్, టూరిజం, ట్రేడ్, టెక్నాలజీ.. ఐదు ‘టీ’లతో బ్రాండ్ ఇండియాను నిర్మిస్తామన్నారు. విదేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని, నూతన విదేశాంగా విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు. తమ ప్రభుత్వ ప్రాధామ్యాలు, ఐదేళ్ల మార్గసూచీని ప్రస్ఫుటీకరించారు. తన 55 నిమిషాల ప్రసంగంలో ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికను వెల్లడించారు. అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించడంతో పాటు అవకాశాల కల్పనకు పాటు పడతామని, పారదర్శక విధానాన్ని అవలంభిస్తామన్నారు. గంగా పరిరక్షణ తమ ప్రభత్వ ప్రథమ కర్తవ్యమని చెప్పారు. దక్షిణాసియాలో బలమైన శక్తిగా భారత్‌ను నిలబెట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, 125 కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దారిదా్యనికి, అకలికి మతం అనేది లేదని పేర్కొన్న రాష్ట్రపతి.. పేదరిక నిర్మూలనకు కేంద్రం పాటుపడుతుందని తెలిపారు.ఉ ప్రజల తక్షణ అవసరాలపై ప్రభుత్వం తక్షణ దృష్టి సారిస్తుందన్నారు. గ్రామీణ ప్రజలకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే అన్ని సౌకర్యాలను గ్రామాలకు విస్తరించాలని సూచించారు.
ఈసీకి ప్రత్యేక అభినందనలు
సార్వత్రిక ఎన్నికలు ఆశావహ దృక్పథంతో జరిగాయని రాష్ట్రపతి అన్నారు. సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. కుల, మత సరిహద్దులు చెరిపేసి ప్రజలు అభివృద్ధికి ఓటేశారని 66.4 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి శుభదాయకమన్నారు. 30 ఏళ్ల తర్వాత ఒకే పార్టీకి అధికారం కట్టబెట్టిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇంత పెద్ద దేశంలో శాంతియుతంగా ఎన్నికలు జరగడం ముదావహం అన్నారు. ఈ ప్రక్రియను సక్రమంగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు అభినందనలు తెలిపారు.
ఏక్‌భారత్.. శ్రేష్ట్ భారత్
అంతర్జాతీయ సమాజం భారత్‌ను గౌరవించేలా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని.. ఈ మేరకు తన ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సభ్యుల భాగస్వామ్యంతోనే ఫలప్రదమైన చర్చలు సాధ్యమని ఎంపీలకు సూచించారు. మనం ప్రజల సేవ కోసమే పార్లమెంట్‌లో ఉన్నామని, ఆ విషయాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదన్నారు. ‘దేశమంతా ఒక్కటే.. దీన్న ఘనమైన దేశంగా చేద్దాం’ (ఏక్‌భారత్..శ్రేష్ట్ భారత్) అన్నదే తమ నినాదమని.. పేదరికాన్ని నిర్మూలించడమే తమ కర్తవ్యమన్నారు. ‘త్రీ డీ.. డిమోక్రసీ, డెమోగ్రఫీ, డిమాండ్.. విధానంతో 60 నెలలలో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పారు.
పన్నుల సరళీకరణ..
ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉన్న నేపథ్యంలో ఆర్తిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు నా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రణబ్ తెలిపారు. ప్రస్తతుం 5 శాతం కంటే తక్కువగా వృద్ధి రేటు ఉందని గుర్తు చేసిన రాష్ట్రపతి ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకొస్తామని తెలిపారు. పెట్టుబడులను ప్రోత్సహిస్తామని, పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసం కల్పిస్తామని, ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామన్నారు. ఆహార ద్రవ్యోల్బణ పరిష్కారానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పద్దుల డిజిటలైజేషన్ ద్వారా పారదర్శకత తీసుకొస్తామన్నారు. ప్రస్తుత పన్నుల రాబడి తగ్గిపోయిందని, ద్రవ్యోల్బణం భరించలేని స్థాయికి చేరిందన్న ప్రణబ్ సరళీకృత పన్నుల విధానంతో పరిశ్రమలకు చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. తయారీ రంగంలో సత్వర అనుమతుల కోసం సింగిల్ విండో విధానం ఏర్పాటు చేస్తామన్నారు. ఎఫ్‌ఐడీలతో సహా పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. ప్రత్యేక పారిశ్రామిక మండళ్లు, పారిశ్రామిక అభిశీద్ధికి ప్రత్యేక విధానం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తామని వివరించారు. ఆహారోత్పత్తుల సేకరణ, మద్దతు ధరల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు.
నూతన యువజన విధానం
నదుల అనుసంధానం గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీటి భద్రతకు కేంద్రం ప్రాధాన్యమిస్తుందని వివరించారు. ఆహార భద్రతను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రతీ రాష్ట్రంలో ఐఐటీలు, ఐఐఎంలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. యువతకు మంచి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆన్‌లైన్ కోర్సులు అందిస్తామన్నారు. యోగాకు, ఆరోగ్య రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అత్యధిక యువత కలిగిన దేశం మనదేనని గుర్తు చేసిన రాష్ట్రపతి.. తమ ప్రభుత్వం నూతన యువజన విదానం అమలు చేస్తుందన్నారు. గ్రామీణ క్రీడలకు మరింత ప్రోత్సాహం కల్పిస్తుందని, ప్రతిభ గల క్రీడాకారుల గుర్తింపు కోసం కొత్త విధానం అమలు చేస్తామన్నారు. రహదారులు అనుసంధానం చేసి రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. తీర ప్రాంత రవాణా కోసం నౌకాశ్రయాల నవీకరణ, అదనపు పోర్టుల నిర్మాణం చేపడతామన్నారు. వజ్ర, చతుర్భుజి పథకం ద్వారా హైస్పీడ్ రైళ్ల సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. మైనార్టీలలో సాంకేతిక విద్య పెంచేందుకు జాతీయ మదర్సా నవీకరణ పథకం ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా పరిశుద్ధ్య భారత్ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పారు.
మహిళకు భద్రత..
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తన ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. నేరన్యాయ విధానంలో మార్పులకు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. హింసకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని, అపరిష్కృత కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. జాతీయ సమగ్ర ఆరోగ్య విధానం ప్రకటిస్తామన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్రపతి తెలిపారు. ఈశాన్య రాష్టాల్రు, కాశ్మీర్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. కాశ్మీర్ పండిట్ల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముఖ్యమైన, జనస్మర్ధ ప్రాంతాల్లో వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త ఒరవడి తీసుకొస్తామన్నారు. బొగ్గు క్షేత్రాల అభివృద్ధిలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులను తుదముట్టించేందుకు ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రక్షణ రంగంలో అధునాతన పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందిపుచ్చుకుంటుందన్నారు. అంతర్గత రక్షణ కోసం నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. భూతాప సంబంధిత అంశాల్లో అంతర్జాతీయ సమాజంతో భాగస్వామ్యమవుతామని తెలిపారు. అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. స్కూలు విద్యలో క్రీడలు భాగం కాబోతున్నాయని, క్రీడాకారులను ముందే గుర్తించి తగిన శిక్షణనిస్తామన్నారు. ప్రభుత్వం కొత్త భూవివాదాన్ని అవలంబించబోతుందని రాష్ట్రపతి వెల్లడించారు. వ్యవసాయంలో పెట్టుబడులు ప్రోత్సహించే విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. ఈసారి రుతుపవనాలు బలంగా ఉన్నాయని అందుకనుగుణంగా అత్యవసర ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రతినీటి చుక్క విలువైనదేనని అందుకే జల వనరుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. త్వరలో ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (ప్రధాన మంత్రి వ్యవసాయ నీటిపారుదల పథకం) ప్రారంభిస్తామన్నారు.
తొలి సమావేశాల్లోనే నిరసన సెగ
లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఆందోళన, వాయిదా
న్యూఢిల్లీ : పదహారో లోక్‌సభ తొలి సమావేశాల్లోనే నిరసన సెగ తగిలింది. టీఆర్‌ఎస్, బీజేడీ ఎంపీల ఆందోళనలతో సభ వాయిదా పడింది. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించిన అనంతరం లోక్‌సభ సమావేశమైంది. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్ సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణలోనే కొనసాగించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు, పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ బీజేడీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఆర్డనిఎన్స్ గిరిజనుల మనోభావాలు దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న వారికి స్పీకర్ సుమిత్రా మహాజన్ సర్ది చెప్పేందుకు యత్నించారు. నిరసన ఆపి, తమ సీట్లలో కూర్చోవాలని సూచించారు. ఇలా చేయడం సరికాదని, ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రతిపాదించినప్పుడు ఆ అంశాన్ని లేవనత్తవచ్చునని సూచించారు. ‘దయచేసి సీట్లలోకి వెళ్లండి.. ఇది సరైంది కాదు. సరైన సమయం కాదు. ఆర్డినెన్స్‌పై చర్చ వచ్చినప్పుడు మీరు ఈ అంశాన్ని లేవనెత్తవచ్చు. ఆ సమయంలో చర్చకు నేను అనుమతిస్తానని’ చెప్పారు. కానీ, ఎంపీలు తమ ఆందోళనను కొనసాగించారు. సభను సజావుగా సాగించేందుకు స్పీకర్ చాలాసేపు యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. భారత పార్లమెంట్ చరిత్రలోనే తరచూ వాయిదాలతో 15వ లోక్‌సభ అపకీర్తి మూటగట్టుకుంది. వరుసగా 40 రోజులకు పైగా ఒక సెషన్ సమావేశాలు పూర్తిగా వాయిదా పడిన రికార్డు సాధించింది. బొగ్గు కుంభకోణం, తెలంగాణ రాష్ట్ర బిల్లు వంటి ఆందోళనలతో గత లోక్‌సభ సమావేశాలు వృథా అయ్యాయి. అయితే, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, తెలంగాణ కల సాకారమైన నేపథ్యంలో 16వ లోక్‌సభ సమావేశాలు సజావుగా సాగుతాయని భావించిన నేపథ్యంలో తొలి సమావేశాల్లోనే నిరసనల సెగ తగలడం గమనార్హం. పోలవరం ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో తేవాలనుకుంటున్న ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ఆయన సహచర ఎంపీలు కవిత, ప్రొఫెసర్ సీతారాం నాయక్, శ్రీహరి, బాల్క సుమన్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకూ తమ ఆందోళన కొనసాగుతుందని, ఇదే విషయమై తాము ప్రధానమంత్రికి కూడా చెప్పారు. కేంద్రం మొండిగా ముందుకు వెళ్లకుండా నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై చర్చించాలని కోరారు. పోలవరం ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రాజెక్ట్ డిజైన్‌ను మార్చాల్సిందేనని ప్రొఫెసర్ సీతారాం నాయక్ స్పష్టంచేశారు. గిరిజనులను ముంచి ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అంతకు ముందు నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ.. హిమాచల్‌ప్రదేశ్ ఘటన బాధాకరమని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాలకు ఆమె ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సురక్షితంగా బయటపడిన వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటంబాలకు టీఆర్‌ఎస్ అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు. ప్రమాద విషయమై లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడామని కవిత వెల్లడించారు. ప్రమాదంపై మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారన్నారు. విద్యార్థులను ఆదుకొనేందుకు, అక్కడి నుంచి స్వస్థలాలకు తరలించేందుకు ఆర్మీ హెలికాప్టర్లను పంపించాలని ప్రధానిని కోరామని ఆమె చెప్పారు. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మోడీ తెలిపారన్నారు. తాము కూడా ఘటనా స్థలానికి వెళ్తున్నామని, అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించడంతో పాటు బాధితులను సురక్షితంగా ఇంటికి చేరుస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.