ప్రతికూల పరిస్థితి మధ్య ఆపరేషన్‌ సెర్చ్‌

nadi
తమ బిడ్డల కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు
సిమ్లా, జూన్‌ 10 (జనంసాక్షి) :
ప్రతికూల పరిస్థితుల్లోనూ బియాస్‌ నదిలో గల్లంతయిన వారి ఆచూకీ కో సం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగు తోంది. గల్లంతైన తెలుగు విద్యార్థుల కోసం ముమ్మరంగా గాలింపు సాగు తోంది. వరద తీవ్రత ఎక్కువగా ఉండ డంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే పాండూ డ్యాం నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. నీటి మట్టం తగ్గితే మృతదేహాలను వెలికితీయడం సులభ మవుతుం దన్న ఉద్దేశ్యంతో నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు తమ వారి ఆచూకీ తెలియక కన్న వారు కుమిలిపోతున్నారు. చివరి చూపునకూ నోచుకోలేక పోయా మని కన్నీరుమున్నీరవుతున్నారు. వీలైనంత త్వరగా తమ వారిని తమకు అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవా రం మరో మృతదేహాన్ని వెలికి తీశారు. అతడ్ని హైదరాబాద్‌కు చెందిన దేవాశిష్‌ బోస్‌గా గుర్తించా రు. ఇంకా అధ్యాపకుడితో సహా మ రో 19 మంది విద్యార్థుల ఆచూకీ లభించాల్సి ఉంది. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి దగ్గరుండి
సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, బియాస్‌ నదిలో గల్లంతై మరణించిన విద్యార్థుల ఘటనపై సిమ్లా హైకోర్టు స్పందించింది. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన న్యాయస్థానం.. నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా, మృతుల కుటుంబాలకు హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షలను పరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపింది.
మరో మృతదేహం లభ్యం
మంగళవారం ఉదయం మరో విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. పండూ డ్యామ్‌కు 100 మీటర్ల దూరంలో మరో విద్యార్థి మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. తల్లిదండ్రులను పిలిపించి మృతదేహాన్ని చూపించగా.. హైదరాబాద్‌ బాగ్‌అంబర్‌పేట సీఈ కాలనీకి చెందిన దేవాశిష్‌ బోస్‌గా అతడ్ని గుర్తించారు. తనయుడి మృతదేహాన్ని చూసి తండ్రి రాబిన్‌బోస్‌ కుప్పకూలిపోయారు. కుమారుడి మరణవార్త తెలిసి తల్లి నిర్మల బోరున వలపించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అక్కడి నుంచి సైన్యానికి చెందిన హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తరలించారు. ఇంకా 20 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. వారి కోసం నదిని జల్లెడ పడుతున్నారు. అయితే, వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది.
ముమ్మరంగా గాలింపు..
మంగళవారం తెల్లవారుజాము నుంచే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్‌ఎప్‌, ఎస్‌ఎస్‌బీ, ఆర్మీ, పారామిలిటరీ, ఐటీబీపీ బలగాలు బియాస్‌ నదిని జల్లెడ పట్టాయి. నేవీకి చెందిన గజ ఈతగాళ్లు కూడా గాలింపు చర్యల్లో పాలుపంచుకున్నారు. 19 మంది విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. 84 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, 10 మంది గజ ఈతగాళ్లు, 550 మంది పారామిలిటరీ బలగాలు ఈ ఆపరేషన్‌లో భాగస్వామ్యమయ్యాయి. నదిలో నీటిని తగ్గించేందుకు పాండూ డ్యాం నుంచి మూడు గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. మృతదేహాలు దిగువకు వెళ్లకుండా డ్యాంకు ఉన్న 11 గేట్లకు వలలు కట్టారు. నీటి పరిమాణం తగ్గిపోతే మృతదేహాలను వెలికితీయడం సులభమవుతుందని భావిస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి పాండూ డ్యామ్‌ వరకూ సహాయక బృందాలు జల్లెడ పడుతున్నాయి. డ్యామ్‌కు 100 విూటర్ల దూరంలో దేవాశిష్‌ బోస్‌ మృతదేహం లభించిన ప్రాంతంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. పాండూ డ్యామ్‌ వరకూ విద్యార్థులు కొట్టుకుపోయే అవకాశం లేదని.. మధ్యలో రాళ్లు, బురదలో ఇరుక్కుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతంపైనే దృష్టి కేంద్రీకరించినట్లు ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ జైదీప్‌సింగ్‌ తెలిపారు. విద్యార్థుల మృతదేహాలన్నింటినీ వెలికితీస్తామని, అందుకు కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు మబ్బునీరు ఉండడం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుందన్నారు. బురద నీరు ఉండడం వల్ల గజ ఈతగాళ్ల ప్రయత్నాలు కూడా సఫలం కావడం లేదన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులందరినీ వెలికితీస్తామని, దీనికి వారం, పదిరోజుల సమయం పట్టొచ్చన్నారు. మృతదేహాలు పాండూ డ్యాం వరకు వెళ్లి ఉండకపోవచ్చని, మధ్యలో కొనదేలిన రాళ్లు, బురద ఉండడం వల్ల అందులో చిక్కుకుపోయి ఉండొచ్చన్నారు. అందుకే తమ దృష్టంతా పాండూ డ్యాం విూద కాకుండా ఎగువ భాగంపై పెట్టామన్నారు.పాండూ డ్యాంలో అంతకంతకూ నీటి తీవ్రత పెరుగుతోంది. మంచు కరిగి నీరు ఎక్కువగా వస్తుండడం, లర్జీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో వరద పెరిగింది. ప్రమాదం జరిగి 40 గంటలు పూర్తయిన నేపథ్యంలో గల్లంతైన వారిలో ఎవరూ బతికి ఉండే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు.
లోతు ఎక్కువగా ఉన్న చోట ఎన్టీఆర్‌ఎఫ్‌, లోతు తక్కువగా ఉన్న చోట ఆర్మీకి చెందిన సైనిక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే ఎగువ నుంచి నీటిప్రవాహం ఎక్కువగా ఉండటం, కొండల్లో నుంచి మంచు కరిగి వస్తున్న నీరు చల్లగా ఉండటంతో డైవర్స్‌ ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గాలింపును నిలిచిపివేశారు. సాయంత్రం 4:30 గంటలపై ఈ ఘటనపై హిమాచల్‌ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాతే గాలింపు కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఉదయం నుంచి జరిపిన గాలింపుల్లో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి దేవశిష్‌ బోస్‌ మృతదేహం లభ్యమైంది. విజ్ఞాన్‌ యాత్రకు వెళ్లిన వీఎన్‌ఎఆర్‌ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు బియాస్‌ నదిలో గల్లంతవగా ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. మరోవైపు తెలంగాణ ¬మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇక్కడే ఉండి సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు ఉన్నతస్థాయి బృందం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తోంది.
బియాస్‌ దుర్ఘటనలో మృతి చెందిన విద్యార్థులకు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం రూ.1.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. హిమాచల్‌ రవాణా శాఖ మంత్రి బాలి దగ్గరుండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బియాస్‌ నది విద్యార్థుల గల్లంతు ఘటనను సుమోటోగా తీసుకున్న హైకోర్టు ఈనెల 16లోగా స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలావుంటే హిమాచల్‌ ప్రదేశ్‌ ఘటనా స్థలంలో గాలింపు చర్యలపై ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మంగళవారం హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌తో సీఎం చంద్రబాబు ఫోన్‌లో సంప్రదించారు. గల్లంతైన విద్యార్థుల వెలికితీతకు సహాయకచర్యలు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు.
అల్వాల్‌లో ఐశ్వర్య అంత్యక్రియలు
హిమాచల్‌ ప్రదేశ్‌ దుర్ఘటనలో మృతిచెందిన వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని ఐశ్వర్య అంత్యక్రియలు అల్వాల్‌ స్వర్గధామ్‌లో కుటుంబసభ్యులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. ఐశ్వర్య అంతిమ యాత్రకు పెద్దఎత్తున తరలివచ్చిన స్నేహితులు, బంధువులు ఆమెకు కన్నీటితో నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే కనకారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, తెరాస నేత గ్జజెల నగేష్‌, భాజపా అధికార ప్రతినిధి రాంచంద్రారావు తదితరులు ఐశ్వర్య మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు.
పార్లమెంట్‌ నివాళి
న్యూఢిల్లీ : బియాస్‌ నది దుర్ఘటనలో మృతి చెందిన వారికి పార్లమెంట్‌ ఉభయ సభలు ఘనంగా నివాళులర్పించాయి. ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో 24 మంది విద్యార్థులు గల్లంతు అయిన ఘటనపై రాజ్యసభ ఆవేదన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. మంగళవారం ఉదయం సభ సమావేశం కాగానే బియాస్‌ మృతులకు నివాళులు అర్పించింది. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపింది. అలాగే, ఇటీవల మృతి చెందిన రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సహా మాజీ సభ్యులకు సభ నివాళులు అర్పించింది. నేదురుమల్లి చేసిన సేవలను చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అటు లోక్‌సభ కూడా బియాస్‌ మృతులకు నివాళులు అర్పించింది. విజ్ఞాన యాత్రకు వెళ్లిన విద్యార్థులు నీటిలో కొట్టుకుపోవడంపై స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇదిలా ఉంటే, ప్రమాద ఘటనపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆయన కోరారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీశ్‌ తివారీ తెలిపారు.
మరోవైపు తమ కన్నబిడ్డల ఆచూకీ తెలియక కన్నవాళ్ల కన్నీరు ఆగడం లేదు.. గుండెల్లో గుబులు తగ్గడం లేదు.. ఎంతకీ తమ వారి ఆచూకీ దొరకడం లేదు.. ఉన్నారో లేరో తెలియక.. చివరి చూపైనా చూసే అవకాశం కలుగుతుందో లేదో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కడుపున పుట్టిన వారి కోసం కన్నీరుమున్నీరవుతున్నారు. ‘హిమాచల’ సానువుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బియాస్‌ నదిలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు దుస్థితి ఇది. 48 గంటలు గడిచినా తమవారి ఆచూకీ లభించక పోవడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ సురక్షితంగా బయటపడే అవకాశం లేదన్న అధికారుల సమాచారంతో విలపిస్తున్న తల్లిదండ్రులు.. కనీసం మృతదేహాలనైనా వెలికితీసి అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
గుండెల నిండా వేదన..
ఎదిగొకొచ్చిన బిడ్డలు అర్ధంతరంగా తనువు చాలించడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంతోషంగా బయల్దేరిన పిల్లలు మృతదేహాలుగా మారడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తమ వారిని కోల్పోయామనే ఆవేదన ఒకవైపు, ఇంకా వారి ఆచూకీ లభించలేదన్న ఆందోళన మరోవైపు.. తల్లిదండ్రులకు నిద్రపట్టనివ్వడం లేదు. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో బిక్కుబిక్కుమంటూ పిల్లల ఆచూకీ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యల విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగి 40 గంటలు గడిచినా ఇంతవరకూ చాలా మంది ఆచూకీ తెలియలేదని వాపోయారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోవడానికి సైన్యాన్ని రంగంలోకి దించాలని డిమాండ్‌ చేశారు.మరోవైపు, సహాయ చర్యలపై ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా మృతదేహాలను వెలికితీసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నాయిని అధికారులను కోరారు. మరిన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను రప్పించాలని సూచించారు. అయితే, నీటి విడుదల గాలింపు చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. పండూ డ్యాంకు దిగువన 16 కిలోమీటర్ల వరకు గాలింపు కొనసాగుతోంది. అయితే, దాదాపు 14 కిలోవిూటర్ల మేర రాక్‌ ఏరియా కావడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో మృతి చెందిన బీటెక్‌ విద్యార్థిని ఆకుల విజేతకు కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటితో తుదీ వీడ్కోలు పలికారు. మంగళవారం మధ్యాహ్నం అశ్రునయనాల మధ్య విజేత అంత్యక్రియలు నిర్వహించారు. విజేత అంతిమ యాత్రలో వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరి చూపు చూసేందుకు సహచర విద్యార్థులు తరలివచ్చారు. అనంతరం మధురానగర్‌ నుంచి పంజగుట్ట శ్మశాన వాటిక వరకూ అంతిమయాత్ర నిర్వహించారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో మృతి చెందిన నలుగురి పార్థివ దేహాలను మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తరలించారు. బియాస్‌ దుర్ఘటనలో హైదరాబాద్‌కు చెందిన విజేత, లక్ష్మీగాయత్రి, ఐశ్వర్య, నల్లగొండ జిల్లాకు చెందిన రాంబాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం నదిలో లభించిన నాలుగు మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు రక్షణ శాఖ ప్రత్యేక విమానంలో అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి నేరుగా నిమ్స్‌ మార్చురీకి తరలించారు. ఉదయం 8 గంటలకు నిమ్స్‌ మార్చురీ నుంచి విజేత మృతదేహాన్ని ఆమె సోదరుడు రాము మధురానగర్‌లోని తమ నివాసానికి తరలించారు. చివరి సారి చూసేందుకు వచ్చిన సహచర విద్యార్థులు, కళాశాల సిబ్బంది, బంధుమిత్రులతో ఆమె నివాసం నిండిపోయింది. అనంతరం అశ్రునయనాల మధ్య విజేతకు తుది వీడ్కోలు పలికారు. పంజగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
మరోవైపు, నల్లగొండ జిల్లాకు చెందిన రాంబాబు భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించారు. తనయుడి మృతదేహాన్ని చూసి తల్లి కుప్పకూలిపోయారు. పేద కుటుంబానికి చెందిన రాంబాబు హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌లో ఎలక్టాన్రిక్స్‌ ఇన్‌స్టమ్రెంటల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. సహచర విద్యార్థులతో కలిసి విజ్ఞాన యాత్రకు వెళ్లిన రాంబాబు.. బియాస్‌ ఘటనలో మృత్యువాత పడ్డాడు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్‌ తీసుకురాగా.. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో స్వస్థలానికి తరలించారు. రాంబాబు పార్థివ దేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో బంధువులు, స్థానికులు తరలివచ్చారు. అశ్రునివాళుల మధ్య అతడికి తుది వీడ్కోలు పలికారు.
క్షేమంగా చేరిన విద్యార్థులు
బియాస్‌ నదీ ప్రమాదం నుంచి బయటపడిన 24 మంది విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వారంతా సోమవారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌ చేరుకున్నారు. అప్పటికే శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎదురుచూస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు, బంధువులు సురక్షితంగా చేరుకున్న తమ పిల్లలను అక్కున చేర్చుకన్నారు. దీంతో వారంతా ఉద్వేగానికి లోనయ్యారు. తమ వారిని చూడగానే పలువురు విద్యార్థుల కంటతడి పెట్టారు. సెకన్ల వ్యవధిలోనే జరిగిన ప్రమాదం గురించి, అక్కడి చేదు అనుభవాలను విద్యార్థులు ఆవేదనతో వివరించారు.