తెలంగాణ తేజాలను

indian-dare

అభినందించిన లోక్‌సభ

ఇదో అపూర్వఘట్టం.. అరుదైన గౌరవం

న్యూఢిల్లీ, జూన్‌ 11 (జనంసాక్షి) :

చిన్న వయస్సులోనే ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన తెలంగాణ తేజాలు మాలవత్‌ పూర్ణ, సాధనపల్లి అనంద్‌కుమా ర్‌లకు లోక్‌సభ అభినందనలు తెలిపింది. బుధవారం సభ సమావేశమైన అనంతరం స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పిన్న వయస్సులో ఎవరెస్ట్‌ను అధిరో హించిన విద్యార్థుల సాహస కీర్తిని ప్రత్యేకంగా ప్రస్తా వించారు. తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల మాలవత్‌ పూర్ణ, సాధనపల్లి ఆనందకుమార్‌లు అతి చిన్న వయస్సులోనే హిమాలయాలను అధిగమిం చారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ విద్యార్థులకు అంతా మంచే జరగాలని ఆమె పేర్కొ న్నారు. ఈ నేపథ్యంలో

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లేచి వారు తెలంగాణ విద్యార్థులు అని నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ తన వ్యాఖ్యలను సరిచేసుకొంటూ ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌.. ఇప్పుడు తెలంగాణగా ఏర్పడిన రాష్ట్ర విద్యార్థులు అని తెలిపారు. ఏ రాష్ట్రం వారైనా వారు భారతదేశానికి చెందిన వారని భారతీయులని పేర్కొన్నారు. ఆ విద్యార్థులకు మంచి భవిష్యత్‌ ఉందన్న సుమిత్రా.. లోక్‌సభ తరఫున అభినందనలు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాలవత్‌ పూర్ణ, ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్‌కుమార్‌ గత నెలలో హిమ సానువుల్లో సాహస యాత్ర చేపట్టారు. ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కులుగా రికార్డు సృష్టించారు.