పోలవరం ఆర్డినెన్స్ రద్దు చేయండి
14 వరకు అసెంబ్లీ సమావేశాలు శ్రీబీఏసీ సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్, జూన్ 11 (జనంసాక్షి) :
తెలంగాణలోని ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని, తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈనెల 14 వరకు నిర్వహించాలని శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే 14న తేదీన తీర్మానం ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. గురువారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమైంది. తొలిసారి సమావేశమైన బీఏసీలో ప్రస్తుత సమావేశాల్లో చేపట్టాల్సిన కార్యాచరణ, అంశాలపై చర్చించారు. ఈనెల 14 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని భేటీలో నిర్ణయించారు. గురు, శుక్రవారాల్లో రెండ్రోజుల పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. గురువారం కొండా సురేఖ, సోమారపు సత్యనారాయణ చర్చను ప్రారంభించనున్నారు. రెండ్రోజుల చర్చ అనంతరం ఈ నెల 13న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెబుతారు. ఈనెల 14న ప్రభుత్వం మూడు తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. తెలంగాణ కోసం అమరులైన వారికి సంతాపం తెలుపుతూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అలాగే, ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర దుర్గటనలో మృతి చెందిన తెలుగు విద్యార్థులకు నివాళులు అర్పిస్తూ మరో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇక తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ తీర్మానం ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. ముంపు మండలాలను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నారు. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై సీఎం సమాధానం ఉంటుంది. ఈనెల 14న మూడు తీర్మానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ అమరవీరులకు సంతాప తీర్మానం, హిమాచల్ ఘటనపై నివాళులు అర్పిస్తూ తీర్మానం, పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్‌గా నల్లాల ఓదేలు నియమితులయ్యారు. ప్రభుత్వ విప్‌గా బోధన్ ఎమ్మెల్యే షకీల్ నియమితులయ్యారు.