నిమ్స్‌ను ప్రక్షాళన చేస్తాం
ప్రజల వద్దకు ప్రభుత్వ వైద్యం
డెప్యూటీ సీఎం రాజయ్య
హైదరాబాద్, జూన్ 22 (జనంసాక్షి) :నిమ్స్‌ను ప్రక్షాళన చేస్తామని ఉప ముఖ్య మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్తామని, అన్నివర్గాల ప్రజలకు మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని
తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. నగరంలో నిర్వహిస్తున్న ఇండో-గ్లోబల్ హెల్త్‌కేర్ సదస్సు ముగింపు సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించే ఆస్పత్రులకు హెల్త్ కేర్ ఎక్స్‌లెన్స్ అవార్డులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ, గడపగడపకూ కార్పొరేట్ వైద్యాన్ని తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నిమ్స్‌లో అక్రమార్కులపై చర్యలు తప్పవని, తెలంగాణాకే తలమానికం లాంటి ఆ ఆస్పత్రిని ప్రక్షాళన చేస్తామని అన్నారు. బీబీ నగర్ నిమ్స్ కేంద్రంగా హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో నిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.