సత్యమేవ జయతేకు జాతీయ అవార్డు

ameer
ముంబయి, జూన్‌ 23 (జనంసాక్షి) :
భ్రూణ హత్యలపై సమాజాన్ని జాగురూకం చేసిన సత్యమేవజయతేకు జాతీయ అవార్డు లభించింది. అయితే అవార్డుల ఉత్సవాలకు ఆమడదూరంలో ఉండే బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌ స్టార్‌ పరివార్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆయన అవార్డు బదులుగా ఒక స్వీట్‌ పాకెట్‌ అందుకున్నారు. దేశం ఎదుర్కొంటున్న పలు సామాజిక సమస్యలపై స్పందిస్తూ అమీర్‌ తొలిసారిగా బుల్లితెరపై సమర్పించిన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమానికి గాను ఈగౌరవం అందుకున్నారు. ఇది తనకెంతో సంతోషంగా ఉందని అమీర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విశేష ప్రజాదరణ పొందడమే గాకుండా అమీర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. సామాజిక సమస్యలపై ఈ కార్యక్రమం ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇదిలావుంటే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇటీవల అమీర్‌ ఖాన్‌ ప్రారంభించిన మహిళల హెల్ప్‌లైన్‌కి పురుషుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పలువురు పురుషులు ఈ హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేసి తమ భార్యలపై ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం. గృహహింస, ఇతరత్రా వేధింపులను ఎదుర్కొంటున్న మహిళలకోసం ప్రత్యేకంగా ఈ హెల్ప్‌లైన్‌ను నెలకొల్పారు. జూన్‌ 17న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, అమీర్‌ఖాన్‌ పాల్గొని ఈ వన్‌ స్టాప్‌ క్రైసిస్‌ సెంటర్‌ను ప్రారంభించారు. సెంటర్లో హెల్ప్‌లైన్‌ ఫోన్లు తీసుకుంటున్న కౌన్సెలర్లను తొలుత అసభ్య ఫోన్‌ కాల్స్‌ బెడద వేధించింది. తాజాగా పురుషుల ఫిర్యాదులు ఎక్కువ కావడంతో వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.