మరో బాదుడుకు మోడీ సర్కార్ సిద్ధం
సిలిండర్‌కు రూ.5, కిరోసిన్ లీటర్‌కు రూపాయి
చేదెక్కనున్న చక్కెర
క్రమంగా సబ్సిడీలు ఎత్తివేసే దిశగా కేంద్రం
మరింత భారంకానున్న మధ్య తరగతి బతుకులు
న్యూఢిల్లీ, జూన్ 24 (జనంసాక్షి) :
ప్రజలు గంపెడాశలతో ఓట్లేసి గెలిపించిన నరేంద్రమోడీ సర్కారు మరో బాధుడుకు సిద్ధమైంది. ఇప్పటికే రైలు ఛార్జీలతో వడ్డన ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచేందుకు చర్యలు ప్రారంభిస్తోంది. గ్యాస్, కిరోసిన్‌లపై ప్రతినెలా కొద్ది మొత్తం చొప్పున వడ్డించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వంటగ్యాస్ సిలిండర్‌కు ప్రతినెలా రూ.5 చొప్పున, కిరోసిన్‌పై నెలకు రూపాయి చొప్పున పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. గ్యాస్ ధరలను సమీక్షించేందుకు ఆదివారం ప్రధాని అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం పీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నృపేంద్రమిశ్రా అధ్యక్షతన మరో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. త్వరలోనే ఈ విషయంపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే బడ్జెట్‌లో వీటిని చేరుస్తారా లేక విడిగా ప్రకటన చేస్తారా అన్నది చూడాలి. అలాగే చక్కెర దిగుమతి సుంకం ఒక్కసారిగా 40 శాతం పెంచడంతో ఇక దాని ధర ఆకాశానికి అంటనుంది. ఆహార పదార్థాలు, ఇతర పదార్థాలపై ప్రభుత్వం బరిస్తున్న సబ్సిడీలను ఎత్తివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒకవైపు రైలు చార్జీల పెంపు ద్వారా రూ.8000 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న మోడీ సర్కారు ఇప్పుడు వంటగ్యాస్, కిరోసిన్ ధరలను పెంచడం ద్వారా బొక్కసాన్ని నింపుకునే పనిలో పడింది. దీంతో పేద, మధ్య తరగతి బతుకులు మరింత దుర్భరం కానున్నాయి.