హరిత హైదరాబాద్‌.. క్లీన్‌ సిటీ

MAIN 1

అంతర్జాతీయ నగరంగా మన రాజధాని

అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, జూన్‌ 27 (జనంసాక్షి) :

హైదరాబాద్‌ నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దడంతో పాటు క్లీన్‌ సిటీగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నగరాన్ని సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. గ్రీన్‌ హైదరాబాద్‌ ప్రాజెక్టుపై సీఎం శుక్రవారం అధికారులతో సమీక్షించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో యేటా 3.3 కోట్ల మొక్కల చొప్పున నాటాలని, ఇందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మూడేళ్లలో 40 లక్షల మొక్కలు నాటాలని, ప్రతి గ్రామానికి 33 వేల మొక్కలు నాటాలని సూచించారు. మూడేళ్ల పాటు హరితహారం నిర్విరామంగా సాగించాలని ఆయన అన్నారు. వర్షాలు కురవగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్నారు. హరితహారానికి అవసరమైన నిధుల కోసం ప్రణాళికలు తయారు చేయాలని, కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా 210 కోట్ల మొక్కలు నాటి కాలుష్య రహిత తెలంగాణ నిర్మిద్దామని సూచించారు. ప్రతి నెలలో ఒక వారాన్ని గ్రీన్‌ వీక్‌గా పరిగణించాలని, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తెలంగాణ రాబోయే ఐదేళ్లలో గ్రీన్‌ స్టేట్‌గా రూపాంతరం చెందాలని, అడవులకు తోడు సామాజిక అడవుల పెంపకంలో దేశానికే ఆదర్శప్రాయంగా నిలవాలని సూచించారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని, ఐటీఐఆర్‌తో పాటు అనేక ఐటీ, ఫార్మా ఇతర పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చే అవకాశముందని అన్నారు. ఈ నేపథ్యంలో నగర వైశాల్యం మరింతగా పెరుగుతుందని ప్రస్తుత హెచ్‌ఎండీఏ పరిధి మొత్తం గ్లోబల్‌ టౌన్‌గా విస్తరిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో నగర ఆహ్లాదపూరిత వాతావరణానికి ఆలవాలంగా ఉండాలని సూచించారు. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఈ వాతావరణంలో గడపడానికి ఇష్టపడేలా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. జీవవైవిధ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. అదే సమయంలో గ్రామీణ తెలంగాణనూ అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయాధారిత ఇతర పరిశ్రమలు నెలకొల్పి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో పారిశ్రామీకరణ వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రీన్‌ వీక్‌ పకడ్బందీగా అమలు చేయాలని, మొక్కలు నాటి వదిలేయడం కాదని, వాటిని కచ్చితంగా సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.