చెన్నైలో ఘోరం

3

కుప్పకూలిన 13 అంతస్తుల భవంతి

ఏడుగురి మృతి

శిథిలాల కింద 190 మంది

ఢిల్లీలో మరో ఘోరం : ఏడుగురి మృతి

చెన్నై/న్యూఢిల్లీ, జూన్‌ 28 (జనంసాక్షి) :

చెన్నైలో ఘోర ప్రమాదం ఏడుగురిని బలితీసుకుంది. వందలాది మందిని క్షతగాత్రులను చేసింది. నిర్మాణంలో ఉన్న 13 అంతస్తుల భవంతి ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో పనిచేస్తున్న కార్మికులంతా శిథిలాలకిందే చిక్కుకుపోయారు. వారిలో శనివారం అర్ధరాత్రి వరకు ఏడుగురు మృత్యువాత పడగా, ఇంకా 190 మందికి పైగా శిథిలాలకిందే చిక్కుకుపోయారు. చెన్నైలోని పోరూరుకు సమీపంలో గల మాంగాడు మౌలివాకం ప్రాంతంలో ‘ట్రస్టు హైట్స్‌’ పేరుతో 13 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు కూడా లేవని సమాచారం. అయితే నిర్మాణ సమయంలో భారీ వర్షం కురవడంతో ఈ భవనం పది అడుగుల మేరకు కూరుకుపోయింది. దీంతో మొత్తానికి మొత్తంగా కుప్పకూలింది. వెంటనే స్పందించిన అధికారులు శిథిలాల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు.  భారీ పొక్లెయిన్‌, క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా శిథిలాల కింద 190 మందికి పైగా కూలీలు చిక్కుకుపోయినట్లు సమాచారం. వారిలో ఎక్కువమంది తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారేనని సమాచారం. అలాగే బీహార్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలు కూడా గాయపడినట్లు తెలిసింది. ప్రమాణ సమాచారం అందుకున్న చెన్నై మహానగర పాలకసంస్థ అధికారులు అరక్కోణం నుంచి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బందిని సంఘటన స్థలానికి హుటాహుటిని పిలిపించారు. ఆ వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపకశాఖ సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శిథిలాలకింది నుంచి 11 మందిని సురక్షితంగా వెలికి తీసినట్లు అధికారులు ప్రకటించారు. భారీ భవనం కూలిపోవడంతో సమీప ప్రాంతాల వారు ఉలిక్కిపడ్డారు. ఏదో విపత్తు ముంచుకొచ్చిందని ఆందోళన చెందారు.

మరోవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలో మూడంస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మరణించారు. భవన శిథిలాల కింద ఆరు కుటుంబాలు చిక్కుకున్నాయని భావిస్తున్నారు. ఉత్తర హస్తినలోని ఇంద్రలోక్‌ ప్రాంతంలో గల

తులసీనగర్‌లో భవనం కుప్పకూలింది. శిథిలాల నుంచి అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహాయంతో 12 మందిని కాపాడారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న దానిపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. మరో పదిహేను మంది శిథిలాల చిక్కుకున్నారని భావిస్తున్నారు. కూలిన భవనం 50 ఏళ్ల క్రితం నిర్మించారని స్థానిక తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కార్మికులు జీవిస్తున్నారని అన్నారు. కూలిన భవనానికి పక్కన కొత్త భవనం నిర్మాణం జరుగుతున్నంద ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. పొక్లెయిన్‌ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు.