పోలవరం పనిపడతాం
మనల్ని ముంచే ప్రాజెక్టు కట్టొద్దు
టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్, జూన్ 28 (జనంసాక్షి) :
పోలవరం ప్రాజెక్ట్ పనిపడతామని టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ తెలిపారు. జూలై నుంచి ఉద్యమ తీవ్రత పెంచాలని ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలకు ప్రణాళిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల రెండో వారంలో హస్తినకు వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని జేఏసీ స్టీరింగ్ కమిటీ నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన జేఏసీ స్టీరింగ్ కమిటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. భేటీ ముగిసిన అనంతరం జేఏసీ చైర్మన్ కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ దుర్మార్గమన్నారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించామన్నారు. రెండో వారంలో ఢిల్లీ పర్యటన ఉంటుందన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని రాష్ట్రపతిని, ప్రధానిని కలిసి కోరతామని చెప్పారు. అలాగే, పోలవరం నిర్మాణంపై ఢిల్లీలో సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలవరం నిర్మాణం అంటే అది కచ్చితంగా ఆదివాసీలపై దాడేనని స్పష్టం చేశారు. ఆదివాసీలు, గిరిజనులను ముంచి ప్రాజెక్ట్ కట్టడం అన్యాయం, అనైతికమన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను నిరసిస్తూ తమ పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు. ఆదివాసి ఎంపీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు. జూలై మూడో వారంలో పోలవరం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎటువంటి ఉద్యమం జరిగినా జేఏసీ మద్దతు ఉంటుందని చెప్పారు.