నాగార్జున చెరువు మింగాడు

1

ఎన్‌ కన్వెన్షన్‌ కబ్జాయే

నిర్దారించిన జీహెచ్‌ఎంసీ అధికారులు

హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) :

గురుకుల ట్రస్టు భూముల్లో పాగా వేసిన బడాబాబుల భరతం పట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు నిర్మించిన వారిపై చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌’పై చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ అక్రమ నిర్మాణమేనని అధికారులు నిర్ధారించారు. సెంటర్‌లో పలు నిర్మాణాలకు మార్కింగ్‌ చేసిన అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. తదుపరి చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. తమ్మడికుంట చెరువు స్థలంలో 3.12 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమంగా కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించినట్లు గుర్తించారు. గురుకుల్‌ ట్రస్టు భూముల పరిరక్షణపై దృష్టి సారించిన అధికారులు శనివారం ట్రస్టు భూముల్లోని తమ్మిడికుంట చెరువును పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ల్యాండ్‌ సర్వే అధికారులు ఇందులో పాల్గొన్నారు. ల్యాండ్‌ సర్వే అధికారులు చెరువు గరిష్ట నీటి సామర్థ్యం (ఎఫ్‌టీఎల్‌)ను, బఫర్‌ జోన్‌ను నిర్దారించారు. ఈ సందర్భంగా ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ యాజమాన్యం 3.12 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలను చేపట్టిందని గుర్తించారు. 1.12 ఎకరాల మేరకు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో, రెండు ఎకరాల బఫర్‌ జోన్‌ను ఆక్రమించినట్లు తేల్చారు. వాస్తవానికి చెరువు ఫుల్‌ట్యాంక్‌ లెవెల్‌తో పాటు బఫర్‌ జోన్‌గా మరో 30 మీటర్లు కూడా ఉండాలి. అయితే, చెరువు గట్టునే ఉన్న కన్వెన్షన్‌ సెంటర్‌ హాలులో 25 విూటర్లు ఫుల్‌ట్యాంక్‌ లెవెల్‌లో ఉందని అధికారులు గుర్తించారు. ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించిన అధికారులు అందులోని హాల్‌, వంట గదులను చెరువు స్థలంలోనే నిర్మించినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మార్కింగ్‌ కూడా చేశారు. దీనిపై ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు ఓ నివేదిక రూపొందించి, ప్రభుత్వానికి అందించనున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎన్‌ కన్వెన్షన్‌లో పరిశీలన సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. విూడియాను లోనికి అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. మరోవైపు, అక్కినేని కుటుంబం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. శనివారం అధికారులు తనిఖీ కోసం వచ్చినప్పుడు నాగార్జున సతీమణి అమల అక్కడికి వచ్చినట్లు తెలిసింది.