స్టటస్‌కోకు హైకోర్టు నో!
నోటిసులివ్వండి.. చట్టపర చర్యలు తీసుకోండి
ఎన్ కన్వెన్షన్‌పై హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, జులై 2 (జనంసాక్షి) :
సినీ హీరో నాగార్జునకు హైదరాబాద్ హైకోర్టులో చుక్కెదురైంది. చెరువు స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మించారంటూ జీహెచ్‌ఎంసీ పేర్కొన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై తదుపరి చర్యలు నిలిపివేయాలన్న ఆయన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. స్టేటస్ కో ఇవ్వాలన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో చట్టపరంగా చర్యలకు ఉపక్రమించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వమైనా చట్టాన్ని అతిక్రమించకూడదని, చట్టపరంగానే నడుచుకోవాలని తేల్చి చెప్పింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోకూడదని పేర్కొంది. చర్యలకు ముందు నోటీసులు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీకి సూచించింది. ఎన్ కన్వెన్షన్ సమీపంలోని తమ్మిడికుంట చెరువు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని (ఎఫ్‌టీఎల్)ను నిర్దేశించాలని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని తమ్మిడికుంటు చెరువు భూమిని ఆక్రమించి తాము ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించామని ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులు కన్వెన్షన్ సెంటర్‌లోని నిర్మాణాలకు మార్కింగ్ చేయడాన్ని సవాలు చేస్తూ కన్వెన్షన్ సెంటర్ యజమాని నాగార్జున, దాన్ని లీసుకు తీసుకున్న సంస్థ ఎన్ 3 ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి నల్లా ప్రీతమ్ సోమవారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లలో విన్నవించారు. వీటిని మంగళవారం విచారించిన న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి బుధవారం తీర్పు వెలువరించారు. తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. చట్టపరమైన చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ముందస్తుగా నోటీసులు జారీ చేశాకే చర్యలు తీసుకోవాలని సూచించారు.అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తాము చెరువును ఆక్రమించలేదని తెలిపారు. తమది అక్రమ నిర్మాణం కాదని, పట్టా భూమిలో అన్ని అనుమతులు తీసుకొని నిర్మించామన్నారు. ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా, వివరాలు తెలపకుండా అక్రమ నిర్మాణమని మార్కింగ్ చేయడం సరికాదన్నారు. ఈ వ్యవహారంలో జీహెచ్‌ఎంసీ తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. అయితే, పిటిషనర్ల వాదనను జీహెచ్‌ఎంసీ తోసిపుచ్చింది. ఈ నిర్మాణం అక్రమమేనని, అక్రమ నిర్మాణాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేసే అధికారుం జీహెచ్‌ఎంసీకి చట్ట ప్రకారం ఉందని వాదించింది. దీనిపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రైవేట్ ఆస్తిలోకి చొరబడే ముందు దాని యజమానులకు ముందుగా తెలియజేయాలని, కానీ ఇక్కడ అధికారులే చట్టాన్ని అతిక్రమించారని వాదించారు. మార్కింగ్ చేసే ముందు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపారు. అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ తాము చట్టాన్ని అతిక్రమించడం లేదని చెప్పారు. తమ్మిడికుంట చెరువును సర్వే చేయడం లేదని తెలిపారు. చెరువులను పరిరక్షించాలన్న హైకోర్టు, లోకాయుక్తల తీర్పు మేరకు వ్యవహరిస్తున్నామని చెప్పారు. తదుపరి చర్యలు తీసుకొనే ముందు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సర్వే చేసేటట్లయితే ముందస్తుగా యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని, ఏ చర్యలు తీసుకుంటారో స్పష్టంగా చెప్పాలని సూచించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణమేనంటూ అడ్వొకేట్ జనరల్ చేసిన వాదనను కూడా రికార్డు చేస్తున్నట్లు తెలిపారు.