మధ్యవర్తిత్వం వహిస్తా

1
ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చిస్తా

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ, జులై 3 (జనంసాక్షి) :

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత విద్యుత్‌, జల వనరుల పంపిణీ విషయంలో ఇటీవల అనేక విభేదాలు తలెత్తాయి. ఇవి కాస్త ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని నిర్ణయించింది. జల వివాదాల పరిష్కారానికి కృష్ణా, గోదావరి వటర్‌ బోర్డులు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని, విద్యుత్‌ సమస్య పరిష్కారానికి కేంద్రం నేతృత్వంలో కమిటీ వేయాలని నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టాన్ని అతిక్రమిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు పీపీఏల రద్దుకు ప్రయత్నించి కయ్యానికి కాలు దువ్వారు. దీనిపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి బాబుకు చీవాట్లు పెట్టించింది. నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు తాగునీటి కోసం కృష్ణా వాటర్‌బోర్డు ఆదేశాల మేరకు రోజుకు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు 3.5 టీఎంసీలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత నీటి విడుదలను నిలిపివేసింది. ఈనేపథ్యంలో మళ్లీ నీటిని విడుదల చేయాలంటూ ఏపీ సర్కారు లేఖ రాయడమే ఆలస్యం కృష్ణా వాటర్‌ బోర్డు మరో వారం రోజుల పాటు రోజుకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలంటూ కృష్ణా నదీ జలాల పంపిణీ బోర్డు చైర్మన్‌ పాండ్యా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. పాండ్యా ఏకపక్ష నిర్ణయంపై తెలంగాణ సర్కారు అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. తమను సంప్రదించకుండా లేఖ రాయడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కేంద్రం నిద్రవీడింది. ఆంధ్రప్రదేశ్‌ సర్కారుపై వల్లమాలిన ప్రేమను కాస్త పక్కన బెట్టి శాంతి మంత్రం అందుకుంది. ఈమేరకు ఈనెల 7, 8 తేదీల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులతో రాజ్‌నాథ్‌సింగ్‌ సమావేశం కావాలని నిర్ణయించారు.