కవ్విస్తూ శాంతి చర్చలా?

3
ముందు తెలంగాణ టీడీపీ నేతలతో ఏకాభిప్రాయానికి రా

గురుకుల్‌ కబ్జాలు కూలిస్తే నీకెందుకు ఉలుకు?

పీపీఏలు, పోలవరం ముంపు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టతకు రా

పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులెంతో.. మీరూ గంతే : మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌, జులై 3 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రజలను, ప్రభుత్వాన్ని నిత్యం కవ్విస్తూ పైకి శాంతి చర్చలు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నటిస్తున్నారని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనే ప్రజల్లో విద్వేషాలు రగిలేలా చేస్తూ ఆపనేదో తామే చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నామని చంద్రబాబు తమపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే చర్యలకు తాను పాల్పడుతూ తమను విమర్శించడం సరికాదన్నారు. గురువారం సచివాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని బాబు బుధవారం ఆరోపించారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని, అవసరమైతే కూర్చొని మాట్లాడుకుందామన్నారు. దీనిపై హరీశ్‌రావు బాబుకు కౌంటర్‌ ఇచ్చారు. చేసేదంతా ఆయన చేస్తూ మమ్మల్ని రెచ్చగొడుతున్నారని అనడం ఎంతవరకు సమంజసమన్నారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) రద్దు చేసుకున్నామా? బలవంతంగా కృష్ణా నీటిని తరలించుకు పోయామా? ఏ విధంగా తాము రెచ్చగొడుతున్నామో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. తమ తరఫు నుంచి ఏమైనా ఇబ్బందులు పెట్టామా? అని ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రయోజనాలను కాపాడాలని చూడడం రెచ్చగొట్టడం ఎలా అవుతందన్నారు. తమ వైపు నుంచి ఒక్క కవ్వింపు చర్య కూడా లేదని ఆంధ్ర సర్కారు కవ్వింపు చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనేందుకే తాము కృషి చేస్తున్నామని చెప్పారు. తాము చెప్పిందే చేస్తామని, చేసిందే చెబుతామని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టకుండా ఆంధ్ర సర్కారు కుట్రలు పన్నుతోందని, దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు అబద్దాలు చెబుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఆంధ్ర సర్కారు ఎన్ని కుట్రలు చేసినా పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. అసత్య ప్రచారాఆలతో పారిశ్రామికవేత్తల్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను తప్పుబట్టిన చంద్రబాబుపై హరీశ్‌రావు మండిపడ్డారు. అన్యాక్రంతమైన భూములను స్వాధీనం చేసుకోవడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. తప్పులను సమర్థిస్తున్న చంద్రబాబుకు దురాక్రమణదారులతో సంబంధం ఉందా? అని నిలదీశారు. గురుకుల్‌ ట్రస్టు భూములను, వక్ఫ్‌ స్థలాలను, ప్రభుత్వ చెరువులను కాపాడాలని కృషి చేస్తున్నామన్నారు. పోలవరం ముంపు గ్రామాల విలీనం విషయంలో స్పష్టతకు రావాలని, ముంపు తక్కువగా ఉండేలా ప్రత్యామ్నాయాలు చూసుకొని ఆదివాసీలను రక్షించాలని కోరారు. వీటిని పట్టించుకోకుండా చంద్రబాబు తెలంగాణను ముంచడం, చీకటి గడ్డగా మార్చడమే పనిగా పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.