‘ఆంధ్రా’ ఎన్‌జీవోలకు టీ సర్కారు షాక్‌

4
189 ఎకరాలు వెనక్కి

స్థల స్వాధీనానికి సీఎం కేసీఆర్‌ హుకుం

స్వాధీన పర్చుకున్న శేరిలింగంపల్లి తహశీల్దార్‌

హైదరాబాద్‌, జూలై 3 (జనంసాక్షి) :

‘ఆంధ్రా’ ఎన్‌జీవోలకు తెలంగాణ సర్కారు షాకిచ్చింది. ప్రభుత్వ భూముల పరిరక్షణపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎన్జీవోలకు ఇచ్చిన 189 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పదేళ్లుగా నిర్మాణాలు చేపట్టకపోవడంతో సదరు స్థలాల్ని స్వాధీనం చేసుకుంది. భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించింది. దీంతో ఏపీఎన్జీవోలకు ఇచ్చిన భూమిని శేరిలింగంపల్లి తహశీల్దారు స్వాధీనం గురువారం చేసుకున్నారు. 1992లో అప్పటి ప్రభుత్వం ఏపీఎన్జీవోల కోసం 189 ఎకరాలను కేటాయించింది. శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి సర్వే నెం 36, 37 లలోని 189 ఎకరాల 14 గుంటల భూమిని ఏపీఎన్జీవోలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు నివాస వసతి కల్పించేందుకు ఏపీ ఎన్జీవోల హౌసింగ్‌ సొసైటీకి ఈ భూమిని అప్పగించింది. అయితే, అప్పటి నుంచి ఈ భూములను వినియోగించలేదు. కొంత భూమిపై సుప్రీం కోర్టులో వివాదం కొనసాగుతోంది. అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ చుట్టపక్కల ఉన్న భూముల పరిరక్షణకు నడుం బిగించింది. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ తరుణంలోనే ఏపీఎన్జీవోల భూముల వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పదేళ్లుగా ఖాళీగా ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. నిరూపయోగంగా, ఖాళీగా ఉన్న భూములను పరిరక్షించాలని అధికారం చేపట్టిన నాటి నుంచే ప్రభుత్వం గట్టి పట్టుదల ప్రదర్శించింది. అందులో భాగంగానే ఆక్రమణకు గురైన గురుకుల్‌ ట్రస్ట్‌ భూములపై, వక్ఫ్‌ భూముల పరిరక్షణపై దృష్టి సారించింది. గురుకుల్‌ భూములను ఆక్రమించుకొని అక్రమంగా నిర్మించిన నివాసాలను కూల్చివేశారు. తాజాగా ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకున్నారు. ఒకవిధంగా ఏపీ ఎన్జీవోలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు షాక్‌ ఇచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కవ్వింపు చర్యలు చేపడుతోందన్న ఆగ్రహంతో ఉన్న కేసీఆర్‌ అందుకు తగిన బుద్ది చెప్పాలని నిర్ణయించారు. అందులో భాగంగానే తాజాగా ఏపీఎన్జీవోలకు కేటాయించిన స్థలాలను వెనక్కి తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం సృష్టించిన పీపీఏల రద్దు వివాదం, బలవంతంగా కృష్ణా నీటిని విడుదల చేయించుకోవడం వంటి పరిణామాలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో ఏపీఎన్జీవోల భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో దాన్ని స్వాధీనం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజేంద్రనగర్‌ ఆర్డీవో సురేశ్‌ ఒడ్డారు, శేరిలింగంపల్లి తహశీల్దారు విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పంచనామా నిర్వహించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదించారు.