త్వరలో గ్యాస్‌ బాదుడు?

1

కిరోసిన్‌పై సబ్సిడీ ఎత్తివేసే అవకాశం

న్యూఢిల్లీ, జులై 4 (జనంసాక్షి) :

రైల్వే చార్జీలను భారీగా బాదేసిన మోడీ సర్కారు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన రెండు రోజుల్లోనే సామాన్యులకు అత్యవసరమైన గ్యాస్‌ ధరనూ పెంచాలని నిర్ణయించింది. నిరుపేదలు గుడ్డిదీపానికి ఉపయోగించే కిరోసిన్‌పై సబ్సిడీ పూర్తిగా ఎత్తివేయాలని వ్యూహం రచిస్తోంది. నిరుపేదలు, పేదలు, మధ్య తరగతి వర్గాలను టార్గెట్‌ చేస్తూ మోడీ సర్కారు మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది. భారీ మొత్తంలో బాదేందుకు ఈమేరకు చమురుశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. వంటగ్యాస్‌పై ఏకంగా రూ.250 చొప్పున, కిరోసిన్‌ లీటర్‌పై రూ.4 నుంచి రూ.5 వరకు పెంచాలని సిఫార్సు చేసింది. అయితే కిరోసిన్‌పై సబ్సిడీ భారాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని సర్కారు యత్నిస్తోంది. అలాగే డీజిల్‌పై నెలవారీగా లీటర్‌కు 40 నుంచి 50 పైసల చొప్పున పెంచేందుకు కసరత్తు చేపట్టింది. ఈ మేరకు పారిఖ్‌ కమిటీ సూచనల మేరకు పెట్రోలియం శాఖ ధరలు పెంచాలని రాజకీయ వ్యవహారాల మంత్రివర్గ సంఘానికి (పీఏసీసీ)కి నివేదించింది. పెంపుపై మంత్రివర్గ సంఘం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. గతంలో పారిఖ్‌ కమిటీ చేసిన ప్రతిపాదనల మేరకు పెట్రోలియం శాఖ తాజాగా ధరల పెంపుపై క్యాబినెట్‌ కమిటీకి సిఫార్సులు చేసింది. కిరోసిన్‌పై లీటర్‌కు రూ.4 నుంచి రూ.5 చొప్పున, గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.250 చొప్పున పెంచాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీకి నివేదించింది. ఇక నెలకు డీజిల్‌ ధరలను 40-50 పైసల వంతున పెంచాలన్న నిర్ణయాన్ని కూడా కొనసాగించాలని సూచించింది. ఈ సిఫార్సులకు క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపితే చాలు.. నూతన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరల మంటతో అల్లాడుతున్న సామాన్యుడికి ఇది పెనుభారంగా మారనుంది. గ్యాస్‌ ధర పెంచక తప్పడంలేదు. ఇప్పటికే రైలుఛార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన ప్రభుత్వం గత వారం వంటగ్యాస్‌ ధర పెంచడానికి ప్రయత్నాలు చేయడంతో ఒక్కసారి ప్రతిపక్షాలు, ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తంకావడంతో గ్యాస్‌ధర పెంపు విషయంలో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. పెట్రోలియం సంస్థల ఒత్తిడితో గ్యాస్‌ధర పెంపు తిరిగి తెరపైకి వచ్చింది. రేపోమాపో గ్యాస్‌పై వడ్డన తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్రంలో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో రెండుసార్లు పెట్రోల్‌ ధర పెరగడం, దానికి తోడు రైలుఛార్జీలు పెరగడం, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో ఉల్లి ధర పెరగడంపట్ల పేద, సామాన్య ప్రజల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో ధరలు పెరిగినప్పుడు బీజేపీ, ఎన్‌డీఏ కూటములు ఆందోళనలు చేపట్టాయని, తాము అధికారంలోకి వస్తే ధరలను నియంత్రిస్తామని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామన్న వారు నేడు ధరలను పెంచడం ఇదేనా అభివృద్థి పథమని ప్రశ్నిస్తున్నారు. వంటగ్యాస్‌ ధర పెంచితే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోకతప్పదని హెచ్చరిస్తున్నారు.