పోలవరం డిజైన్‌ మార్చాల్సిందే

3

ధరల అదుపులో భాజపా సర్కారు విఫలం

సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌

విజయవాడ, జులై 4 (జనంసాక్షి) :

గిరిజన గ్రామాలను పూర్తిగా ముంచే ప్రస్తుత పోలవరం డిజైన్‌ తమకు అంగీకారం కాదని, దానిని మార్చాల్సిందేనని సీపీఎం జాతీయ కార్యదర్శి  ప్రకాశ్‌ కారత్‌ అన్నారు. ముంపు ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేకుండా డిజైన్‌ చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పోలవరం నమూనాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామనీ కొత్త డిజైన్‌ చేపట్టాలని సూచించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీట్‌ ద ప్రెస్‌లో ఆయన పాల్గొన్నారు. పోలవరం వల్ల గిరిజన సంస్కృతి దెబ్బతినడమే గాకుండా, ఆ ప్రాంతాలు నీటమునగడం సరికాదన్నారు. ఇప్పటికే తమ పార్టీ ఖమ్మం శాఖ ఆందోళన చేస్తోందన్నారు. నీరు, విద్యుత్‌ సమస్యలపై ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు తక్షణం చర్చించుకోవాల్సిన అవసరముందన్నారు. పరస్పరం దూషించుకోకుండా సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలన్నారు. ఇంధన ధరలపై నియంత్రణ ఎత్తివేసేందుకు మోడీ సర్కారు చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుబట్టారు. ధరల నియంత్రించడంలో మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. కార్పొరేట్‌ సంస్థలకు ఉపయోగపడేలా మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోందని దుయ్యబట్టారు. ఇంధన ధరలపై నియంత్రణ ఎత్తివేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పెరిగిన రైల్వే ఛార్జీలపై ప్రజలపై భారం వేశారని, త్వరలోనే ఎల్పీజీ గ్యాస్‌, డీజిల్‌ ధరలు పెంచేందుకు మోడీ సర్కార్‌ సన్నాహాలు చేస్తుందన్నారు. రైల్వేఛార్జీల పెంపుతో ప్రజలపై పెనుభారం వేశారని  ప్రకాశ్‌కారత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరలపై నియంత్రణ ఎత్తేసేందుకు మరో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గ్రావిూణ ఉపాధి హామి పథకానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందన్నారు. మోడీ సర్కార్‌ గతంలోయూపీఏ ప్రభుత్వం నిర్ణయాలను సవిూక్షించాల్సిన అవసరముందన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై ప్రవేటు జోక్యాన్ని తగ్గించాల్సిన అవసరముందన్నారు. ద్రవ్యోల్భనాన్ని తగ్గించి, నిత్యావసరాల ధరలను తగ్గించాలని సూచించారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తుందని విమర్శించారు. ఇంధన ధరలపై నియంత్రణ ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే ప్రజలపై రైల్వే ఛార్జీల భారం మోపిన బిజెపి ప్రభుత్వం త్వరలోనే ఎల్పీజీ, డీజిల్‌, కిరోసిన్‌ ధరలు పెంచే అవకాశముందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచే ప్రమాదముందన్నారు. దేశంలో నిరుద్యోగ నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. మోడీ చెబుతున్న కఠిన నిర్ణయాలు ప్రజలపై భారం మోపేందుకేనని గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు తర్వాత లెప్ట్‌ పార్టీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ప్రకాశ్‌ కారత్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో నల్లధనం వినియోగం పెరిగిపోయిందనీ అందుకే వామపక్షాలు చతికిల పడ్డాయన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు పోరాటం సాగిస్తామని కారత్‌ తెలిపారు.తృణమూల్‌ ఎంపీ తపస్‌ పాల్‌ వ్యాఖ్యలు క్షమాపణలతో పూర్తి కాలేదని పార్లమెంటులో దీనిపై పోరాడతామని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌ లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ మద్దతు దారులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. తృణమూల్‌ ఎంపీ తపస్‌ పాల్‌ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. తపస్‌ పాల్‌పై చట్టపరంగా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. పాల్‌ పై చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో డిమాండ్‌ చేస్తామని తెలిపారు.