సీఎం మరో సంచలన నిర్ణయం

4

ఎఫ్‌డీసీ భూములు వెనక్కి

సీమాంధ్ర సినిదిగ్గజాల గుండెల్లో రైళ్లు

హైదరాబాద్‌, జులై 4 (జనంసాక్షి) :

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫిల్మ్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఏపీఎఫ్‌డీసీకి ఇచ్చిన 20 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ సీసీఎల్‌ఏ ఎస్‌కే సిన్హా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1982లో ఆంధప్రదేశ్‌లో సినీ రంగ అభివృద్ధి కోసం గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎఫ్‌డీసీకి దాదాపు 40 ఎకరాల భూమిని కేటాయించింది. అందులో పద్మాలయా స్టూడియో అభివృద్ధి కోసం 9 ఎకరాలు, రామానాయుడు స్టూడియోకు 5 ఎకరాలు, మరికొన్ని స్టూడియోల కోసం కొన్ని ఎకరాలను కేటాయించారు. ఇందులో నాలుగు ఎకరాల భూమి కబ్జాకు గురి కాగా ఆ భూమికి రక్షించాల్సిందిగా ఏపీఎఫ్‌డీసీకి సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై హైదరాబాద్‌ కలెక్టర్‌ సైతం ఉత్తర్వులు జారీ చేశారు. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీఎఫ్‌డీసీకి కేటాయించిన 20 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆంధప్రదేశ్‌ ఫిలిం చాంబర్‌ కార్యవర్గ సమావేశం తీవ్రగందరగోళం నడుమ వాయిదా పడింది. శుక్రవారం కార్యవర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఏపీ ఫిలించాంబర్‌ను తెలంగాణ చాంబర్‌గా పేరు మార్చాలని డిమాండ్‌ చేశారు. అటు కార్యవర్గ సమావేశంలోనూ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలుగు ఫిలించాంబర్‌గా మార్చాలన్న ప్రతిపాదనను తెలంగాణ రాష్టాన్రికి చెందిన సభ్యులు వ్యతిరేకించారు. రెండు కమిటీలు వేసి, కామన్‌గా ఒక ఛైర్మన్‌ను నియమించాలని నిర్మాత నట్టికుమార్‌ డిమాండ్‌ చేశారు. రెండు కమిటీల మధ్య సమస్యలు వస్తే ఛైర్మన్‌ వాటిని పరిష్కరిస్తారని ఆయన అన్నారు. అప్పటి వరకు ఫలించాంబర్‌లో ఎలాంటి ఎన్నికలు జరగవని నట్టి కుమార్‌ చెప్పారు. అలాగే ఇతర సినీ ప్రముఖులకు సినీరంగ అభివృద్ధి కోసం కేటాయించిన భూములను ఇతర కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న భూములను కూడా త్వరలోనే వెనక్కు తీసుకునేందుకు సీఎం రంగం సిద్ధం చేస్తున్నారు.