గోవా మాజీ సీఎం రాణేపై అవినీతి కేసు
పనాజీ, జూలై 5 (జనంసాక్షి) :
గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్‌సింగ్ రాణేపై ప్రత్యేక దర్యాప్తు బృందం అవినీతి కేసు నమోదు చేసింది. ఒక సంస్థ మైనింగ్ లీజులు ఆమోదించడానికి గోవా మాజీ సీఎం రాణే, ఆయన కుమారుడు ఎమ్మెల్యే విశ్వజిత్ రూ.6 కోట్ల ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు నమోదు చేసింది. మూడేళ్ల క్రితం వీరు ముడుపులు తీసుకున్నట్టు ఆరోపిస్తూ సిట్ ఈనెల 3న కేసు పెట్టింది. విచారణ కోసం వీరిని పిలచేయోచనలో సిట్ ఉన్నట్లు తెలిసింది. ఈమేరకు డీఐజీ కేకే వ్యాస్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఫిర్యాదుదారు చేసిన ఆరోపనలపై దర్యాప్తు చేస్తున్నామని, అది పూర్తికాగానే చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని తెలిపారు. ఇంటరాగేషన్ కోసం రాణేను ఎప్పుడు పిలవాలన్నది సిట్ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. రాణే ప్రస్తుతం గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు. రాణే సీఎంగా ఉన్నప్పుడు మైనింగ్ లీజ్ కోసం రూ.6 కోట్లు డిమాండ్ చేశాడని, ఆయన కుమారుడు విశ్వజిత్ ఆ మొత్తాన్ని తీసుకున్నాడని దహేజ్ మినరల్స్ చైర్మన్ బాల్‌చంద్రనాయక్ ఇటీవల ఆరోపించారు. ఈ ఆరోపణల మేరకు ఐపీసీ సెక్షన్లు 384 (బలవంతపు వసూళ్లు). 120బీ, 1988, అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్ 7తో పాటు 13(1)(డి), 23(2)కింద వారిపై కేసు నమోదు చేశారు. అయితే తాను మూడుపులు డిమాండ్ చేసినట్టుగా వచ్చిన ఆరోపణలను రాణే ఖండించారు. తాను నాయక్ అన్న వ్యక్తికి ఎన్నడూ కలువలేదని చెప్పారు. ఆయన ఎవరో కూడా తనకు తెలియదని, తనపై చేసినవి అసత్య ఆరోపణలేనని ఆయన కొట్టిపడేశారు.