జెడ్పీ పీఠాల కోసం గింత దిగజారుడా?

2

జానారెడ్డి-చంద్రబాబు ములాఖత్‌పై హరీశ్‌ ఆశ్చర్యం

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టామని ఆ పార్టీతోనే కలుస్తారా?

బంగారు తెలంగాణ కోసమే మాతో కలిశారు : మంత్రి హరీశ్‌రావు

మెదక్‌, జూలై 5 (జనంసాక్షి) :

జిల్లా పరిషత్‌ చైర్మన్ల పదవుల కోసం గింత దిగజారుతారా అంటూ కాంగ్రెస్‌, టీడీపీ నేతలను మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇది పవిత్ర కలయిక అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేవలం ఒకటి, రెండు పదవుల కోసం కాంగ్రెస్‌ దిగజారిందని విమర్శించారు. శనివారం హరీశ్‌రావు మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. జెడ్పీ చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఏకపక్ష ఫలితాలు సాధించిందన్నారు. మొత్తం ఏడు జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరుగగా ఆరింటిని తమ పార్టీ కైవసం చేసుకుందని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ నగర, పురపాలక సంస్థలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లలో పాగా వేసిందని చెప్పారు. బంగారు తెలంగాణ కోసమే కొంత మంది తమ పార్టీలోకి వచ్చారని చెప్పారు. జెడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీలు జుగుప్సాకరమైన పొత్తులకు తెరలేపాయని హరీశ్‌రావు మండిపడ్డారు. కేవలం ఒకటి, రెండు పదువల కోసం రెండు పార్టీలు చేతులు కలపడం అనైతికమని ఇది అపవిత్ర కలయిక అని అన్నారు. కాంగ్రెస్‌ టీడీపీలది గురువింద నీతి అని విమర్శించారు. జడ్పీ పదవుల కోసం చంద్రబాబు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి తెర వెనుక చర్చలు జరిపారని ఆరోపించారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న చంద్రబాబుతో జానారెడ్డి ఎలా చేతులు కలుపుతారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనే మొనగాడ్ని తానేనని చెప్పుకొనే చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌తో ఎలా జత కలిశారని నిలదీశారు. కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం తెలంగాణకు ద్రోహం చేయడమేనని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. పీపీఏల రద్దు పేరిట తెలంగణ అభివృద్దిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్న, నీటిని అక్రమంగా తరలించుకుపోతున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం అంటే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అవుతుందన్నారు. పదవుల కోసం చంద్రబాబుతో రాజీపడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీశారని మండిపడ్డారు. సీనియర్‌ నాయకుడిగా ఉన్న జానారెడ్డి ఒకటి రెండు పదవుల కోసం నైతికంగా దిగజారిపోవడం అనైతికం, అవమానకరమన్నారు. మీ నాయకత్వం బాబుకు నచ్చిందా? లేక బాబు నాయకత్వం మీకు నచ్చిందా? ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు.కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు పెట్టుకున్నందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని నమ్మి పలువురు తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అందుకే ఏడింట ఆరు జిల్లా పరిషత్‌లను, మెజార్టీ ఎంపీపీలను, మునిసిపాలిటీలను గెలిపించారని చెప్పారు. కాంగ్రెస్‌, టీడీపీల అపవిత్ర కలయికను ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తిప్పికొట్టారన్నారు. బంగారు తెలంగాణ కోసమే కొంత మంది తమ పార్టీలోకి వచ్చారని తెలిపారు.