కాంగ్రెస్‌కు స్పీకర్‌ షాక్‌

3

ప్రతిపక్ష హోదాపై నిర్ణయం తీసుకోలేదు

లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) :

కాంగ్రెస్‌కు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ షాక్‌ ఇచ్చారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందేందుకు అవసరమైనన్ని సీట్లు కాంగ్రెస్‌ గెలవని నేపథ్యంలో ఆ పార్టీకి ఆ హోదా కల్పించి విషయంలో ఆమె ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సస్పెన్స్‌ కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించే విషయంపై శనివారం మీడియా అడిగిన ప్రశ్నలకు స్పీకర్‌ సమధానం దాటవేశారు. అన్ని పార్టీల నేతలతో ఆమె విందు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్ష హోదాపై విలేకరులు ప్రశ్నించగా సభా వ్యవహరాలు చర్చించడానికి ప్రస్తుతం సమావేశమయ్యామంటూ సమాధానం దాటవేశారు. రాజ్యాంగ నిపుణులు, అనుభవజ్ఞులను సంప్రదించిన బడ్జెట్‌ సమావేశాల్లోగా విపక్ష హోదా నిర్ణయం తీసుకుంటానని గతంలో ఆమె చెప్పారు. సోమవారం నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆమె సమాధానం దాటవేయడాన్ని బట్టి కాంగ్రెస్‌కు విపక్ష హోదా దక్కడం అనుమానమేనని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కాంగ్రెస్‌ గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశంలో లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే సైతం హాజరయ్యారు. అంతకుముందు యూపీఏ ప్రతినిధి బృందం స్పీకర్‌తో ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే ఈ సమావేశంలో ప్రతిపక్ష హోదా అంశం చర్చకు రాలేదని ఖర్గే చెప్పారు. విందు సమావేశంలోనూ కాంగ్రెస్‌ ఈ అంశాన్ని లేవనెత్తలేదు. కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాకుండా స్పీకర్‌ ఎలా నిర్ణయం తీసుకుంటారని ఒక కేంద్ర మంత్రి ప్రశ్నించారు. 1977లో దీనికి సంబంధించిన నిబంధనలు రూపొందించారని, తాము వాటినే అనుసరిస్తామన్నారు. 1984లో టీడీపీకి కూడా ఆ హోదా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. లోక్‌సభ సభ్యుల సంఖ్య 543 మంది కాగా కాంగ్రెస్‌కు 44 మంది సభ్యులే ఉన్నారు. 10 శాతం సీట్లను సాధించకపోవడంతో కాంగ్రెస్‌ విపక్ష హోదా అర్హతను కోల్పోయింది.