ఇరాక్‌ నుంచి ఇంటికి

4A4B
క్షేమంగా తిరిగొచ్చిన తెలంగాణ బిడ్డలు

కేరళ నర్సులు

హైదరాబాద్‌/కొచ్చి, జూలై 5 (జనంసాక్షి) :

ఇరాక్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ బిడ్డలు కేరళ నర్సులు శనివారం స్వదేశానికి తిరిగివచ్చారు. 46 మంది నర్సులతో పాటు 137 మంది భారతీయులు ఎయిరిండియా ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిరిండియాలో అతిపెద్ద విమానం అయిన బోయింగ్‌ 777ఎల్‌ఆర్‌లో మొత్తం 183 ప్రయాణికులు, 23 మంది విమాన సిబ్బంది, ముగ్గురు ప్రభుత్వ అధికారులు వచ్చారు. సాంకేతిక కారణాల వల్ల తొలుత ముంబైలో ల్యాండ్‌ అయిన ఈ విమానానికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కొచ్చి విమానాశ్రయానికి ప్రత్యేక విమానం బయల్దేరింది. కేరళకు చెందిన 46 మంది నర్సులకు ఇక్కడ ఘన స్వాగతం లభించింది. అనంతరం ప్రత్యేక విమానం హైదరాబాద్‌కు చేరుకుంది. దాదాపు 100 మంది ప్రయాణికులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారే. ఉపాధి కోసం ఇరాక్‌కు వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు. తెలంగాణ జిల్లాల నుంచి పొట్ట చేతబట్టుకొని ఉపాధి కోసం ఇరాక్‌ వెళ్లి అక్కడి పరిస్థితులతో స్వదేశానికి తిరిగివచ్చారు. కేంద్ర ప్రభుత్వ చొరవతో వారంతా స్వదేశానికి సురిక్షతంగా తిరిగివచ్చారు. వారికి శంషాబాద్‌ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తమ వారిని పట్టుకొని ఆనందభాషాలు రాల్చారు.

కొచ్చి ఎయిర్‌పోర్టులో ఆనందోత్సాహాలు..

కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం ఆనందోత్సాహాలకు, భావోద్వేగాలకు వేదికైంది. 46 మంది భారతీయ నర్సులు సురిక్షతంగా స్వరాష్ట్రంలో అడుగుపెట్టడంతో వారి కుటుంబాల్లో అంతులేని ఆనందం వెల్లివిరిసింది. తమ వారిని చూసుకొని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఆనంద భాష్పాలతో తిరిగివచ్చిన హత్తుకొని విలపించారు. నర్సులు తిరిగివస్తున్నారని తెలిసి వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, అధికారులు, విూడియా పెద్ద ఎత్తున కొచి విమానాశ్రయంలో బారులు తీరడడంతో ఎయిర్‌పోర్టు సందడిగా మారింది. ఉగ్రవాదుల చెర వీడి.. దాదాపు నెల రోజుల ఉత్కంఠ తర్వాత స్వదేశంలో అడుగుపెట్టిన నర్సులకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీ తదితరులు వారికి స్వాగతం పలికారు. వారు సురక్షితంగా తిరిగిరావడంపై చాందీ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది భారత విదేశాంగ శాఖ విజయం’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, సహకారంతో నర్సులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చామన్నారు. మోడీ ప్రభుత్వం కృషి వల్ల తమ రాష్ట్ర వాసులు ప్రాణాలతో తిరిగివచ్చారని, అందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఐదు గంటల పాటు ఉత్కంఠ

ఇరాక్‌లో తిరుగుబాటుదారుల చెర వీడిన 46 మంది నర్సులతో పాటు 137 మంది భారతీయులు స్వదేశానికి ప్రయాణమయ్యారు. అయితే, ఈ మధ్యలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిర్దేశిత సమయం కంటే విమానం ఐదు గంటల ఆలస్యంగా కావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అయితే, తమ వారు సురక్షితంగా చేరడంతో సంతోషంలో మునిగిపోయారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల విమానం రాక ఆలస్యమైందని అధికారులు తెలిపారు. ఎలాంటి షెడ్యూల్‌ లేని ప్రత్యేక విమానం వివిధ దేశాల ఎయిర్‌ స్పేస్‌ల మీదుగా వచ్చేందుకు అనుమతి లభించడానికి సమయం పట్టిందని, అలాగే, ప్రయాణికులకు సంబంధించిన కొన్ని పేపర్లలోనూ ఆలస్యమైందని పేర్కొన్నారు. 46 మంది నర్సులు, 137 మంది ప్రయాణికులతో ప్రత్యేక విమానం ముంబై చేరుకుంది.