ఈఎన్‌టీ భూములు వాపస్‌

5

సీఎం కేసీఆర్‌ హుకుం

కబ్జాకోరులు, సీమాంధ్రుల గుండెల్లో గుబులు

తెలంగాణ భూముల పరిరక్షణే ధ్యేయంగా సర్కార్‌

హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి) :

ప్రభుత్వం అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే పనిని ముమ్మరం చేసింది. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న భూములను, ప్రైవేట్‌ వ్యక్తుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏపీఎన్జీవోలకు హైదరాబాద్‌ గోపన్‌పల్లి శివారులో కేటాయించిన 189 ఎకరాలను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ)కు కేటాయించిన 16.9 ఎకరాల స్థలాన్ని శనివారం ఆధీనంలోకి తీసుకుంది. తాజాగా ఈఎన్‌టీ ఆస్పత్రి సమీపంలో ప్రైవేట్‌ వ్యక్తలు ఆధీనంలో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది.

హైదరాబాద్‌ నడిబొడ్డున అత్యంత వివాదాస్పదంగా ఉన్న ఈఎన్‌టీ భూముల వ్యవహారంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేసిన భూములు వెనక్కి తీసుకొనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అధికారులతో చర్చించారు. శనివారం రెవెన్యూ శాఖపై సవిూక్ష నిర్వహించిన కేసీఆర హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ భూములపై ఆరా తీశారు. ఏయే ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఈఎన్‌టీ భూముల వ్యవహారం చర్చకు వచ్చింది. అబిడ్స్‌లోని ఈఎన్‌టీ ఆస్పత్రికి సంబంధించి 3,300 గజాల భూమిని ముగ్గురు వ్యక్తులకు నవీన్‌ మిట్టల్‌ కలెక్టర్‌గా ఉన్న సమయంలో రెగ్యులరైజ్‌ చేసి ఇచ్చారని అధికారులు తెలిపారు. ఈఎన్‌టీ భూముల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని కేసీఆర్‌కు అధికారులు వివరించారు. అయితే, ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే అధికారం కలెక్టర్‌కు లేనందున ఆ భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఏపీఎఫ్‌డీసీ భూములు స్వాధీనం

1982లో ఏపీఎఫ్‌డీసీకి ప్రభుత్వం షేక్‌పేట పరిధిలోని ప్రశాసన్‌నగర్‌ సమీపంలో సుమారు 50 ఎకరాల మేర భూములను కేటాయించింది. ఇందులో దాదాపు 30 ఎకరాల వరకు స్టూడియోలు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. అయితే, మిగతా స్థలం నాటి నుంచి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న భూములను గత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మళ్లీ ఏపీఎఫ్‌డీసీకి 2008లో కేటాయించింది. అయితే అప్పటి నుంచి కూడా ఇందులో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. తాజాగా అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల పరిరక్షణకు నడుం బిగించింది. వచ్చీ రావడంతోనే గురుకుల్‌ ట్రస్టు భూముల్లో వెలిసిన భవనాలను నేలమట్టం చేసింది. మిగతా వారికి

నోటీసులు జారీ చేసింది. అలాగే, ఏపీఎన్జీవోలకు కేటాయించిన 189 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. తాజాగా ఏపీఎఫ్‌డీసీకి చెందిన 16.9 ఎకరాల భూమిని అదుపులోకి తీసుకుంది. శనివారం ఈ స్థలంలో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ బోర్డులను కూల్చివేసి తెలంగాణ ప్రభుత్వ బోర్డులను ఏర్పాటు చేశారు. జీవో నెం.571 ప్రకారం నిరుయోగంగా ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు షేక్‌పేట తహశీల్దార్‌ చంద్రావతి తెలిపారు. ప్రభుత్వం సంస్థలు, పరిశ్రమలు, వ్యక్తులకు కేటాయించిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోతే స్వాధీనం చేసుకుంటామని గత ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న భూములపై గత కలెక్టర్‌ రిజ్వీ కూడా నోటీసులు జారీ చేశారని, కానీ ఏపీఎఫ్‌డీసీ నుంచి స్పందన రాలేదని చెప్పారు. దీంతో ఏపీఎఫ్‌డీసీ భూములను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.