ఇరాక్‌లో మనవాళ్ల కోసం మొబైల్‌ టీంలు ఏర్పాటు చేశాం

1
అనుక్షణం అప్రమత్తంగా ఉన్నాం

భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌

న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి) :

ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల ఆచూకీ కనుక్కునేందుకు మొబైల్‌ టీంలు ఏర్పాటు చేశామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ తెలిపారు. ఆదివారం ఆయన న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇరాక్‌లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. మనవాళ్ల రక్షణ, వారిని వెనక్కి రప్పించే విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ఇరాక్‌లోని కల్లోలిత ప్రాంతాల్లో 2,200 మంది భారతీయులుగా ఉండగా వారందరిని స్వదేశానికి రప్పిస్తున్నామని తెలిపారు. 1,600 మంది స్వదేశానికి తిరిగిరావడానికి ప్రభుత్వం టికెట్లు కొనుగోలు చేయగా, మరో 600 మందికి వారు పనిచేస్తున్న కంపెనీలు టికెట్లకు డబ్బులు చెల్లించాయని ఆయన తెలిపారు. ఆదివారం రాత్రి 117 మంది ఢిల్లీకి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. అక్కడ చిక్కుకున్న కేరళ నర్సులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 230 మందికిపైగా శనివారం ముంబైకి చేరుకున్న విషయం తెలిసిందే. ఇరాక్‌లో రసాయన ఆయుధాలు ఉన్నాయని ఆరోపిస్తూ దాడికి దిగిన అమెరికా ఆ దేశ పాలకుడు సద్దాం హుస్సేన్‌ను ఉరితీసిన తర్వాత షియాల నేతృత్వంలో పాలన సాగుతోంది. సద్దాం అనుకూలురైన సున్నీ వర్గానికి చెందిన తిరుగుబాటుదారులు ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగారు. ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతోన్న తిరుగుబాటుదారులు దేశ రాజధానిని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. త్వరలోనే అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తిరుగుబాటుదారులు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రత బలగాలు, తిరుగుబాటుదారులకు మధ్య సాగుతున్న పోరాటంలో సామాన్యులు సమిధలు కాకుండా ఉండేందుకు ఆయా దేశాలకు చెందిన పాలకులు, వివిధ అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈక్రమంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంపై దృష్టి కేంద్రీకరించింది.