తమిళనాట మరో ఘోరం
http://JanamSakshi.org/imgs/2014/07/2b.jpg
గోడకూలి 11 మంది మృతి
చెన్నై, జూలై 6 (జనంసాక్షి) :
తమిళనాట మరో ఘోరం జరిగింది. చెన్నైలో నాలుగు అంతస్తుల భవనం కూలి 62 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే తాజాగా ఆదివారం మరో సంఘటన చోటుచేసుకుంది. తిరువల్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని ఉపరపలియన్‌లో గోడౌన్ గోడకూలిన ఘటనలో పదకొండు మంది మరణించారు. చనిపోయిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. గత నెల నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో 62 మంది మృతి చెందగా, వీరిలో 36 మంది తెలుగువారు కావడం గమనార్హం. భారీగా వర్షాలు కురవడంతో 20 అడుగుల ఎత్తునగల ప్రహారి కూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 11 మంది దుర్మరణం చెందారు. శిథిలాల కింద మరికొంత మంది ఉంటారని భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్‌తో అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గోడౌన్ గోడను ఆసరాగా చేసుకొని వలసకూలీలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ గుడిసెలపైనే గోడ కూలింది. మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాకుళం జిల్లా వారిగా గుర్తించారు. మృతుల్లో పైడిరాజు, సింహాద్రి, వీరగురు, విజయమ్మ, లక్ష్మీ, పెంటయ్య, సింహాచలం, వేముల్గ, జయమ్మలుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. భారీ ప్రాణనష్టం జరిగినందున ఆమె వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల పరిహారాన్ని తమిలనాడు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, తమిళనాడులో గోడకూలి పదకొండు మంది మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతో సమీక్షించిన ఆయన హుటాహుటిన చెన్నైకి వెళ్ళాల్సిందిగా నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సహాయ చర్యలకై విపత్తు బృందాన్ని పంపడంతో పాటు బంధువులకు సమాచారం అందించడానికి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆందోళనలతో ఉన్న బంధువుల సహాయార్థం రవాణా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు అధికారులను ఆదేశించారు.