నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న విపక్షాలు
ధరల పెరుగుదల, ప్రతిపక్ష హోదాపై నిలదీసే అవకాశాలు
న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి) :
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలకాంశాలు, బిల్లులు, ఆర్డినెన్స్‌లు చర్చకు రానున్నాయి. 28 సిట్టింగ్‌లతో 168 గంటలపాటు జరిగే ఈ సమావేశాల్లో రైల్వే ఛార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, కేంద్రమంత్రి నిహాల్‌చంద్‌పై వచ్చిన ఆరోపణలు తదితర అంశాలపై వాడివేడిగా చర్చ జరగనుంది. ఈ క్రమంలో యూపీఏ, ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల కాలంలో ధరల పెరుగుదల, ప్రభుత్వం చేపట్టిన పనులు ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసి ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో శస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఈనెల 8వ తేదీన పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్, 9న ఆర్థిక సర్వే నివేదిక, 10న సాధారణ బడ్జెట్‌లను ప్రవేశపెట్టనున్నారు. పోలవరం ఆర్డినెన్స్‌తో సహా టెలిఫోన్ రెగ్యులేటరీ ఆథారిటీ (ట్రాయ్) చట్టాల సవరణలు ఆర్డినెన్స్ బిల్లు కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానుంది. అదేవిధంగా యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన పలు బిల్లులు ఆర్డినెన్స్‌లో పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్నవాటిని ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం చర్చ పెట్టే అవకాశం ఉంది. వీటిపై చర్చ జరిగిన అనంతరం ఉభయ సభల ఆమోదం పొందడానికి ప్రభుత్వం కృషిచేసే అవకాశాలు ఉన్నాయి. ఆయా బడ్జెట్‌ల ప్రతిపాదనలు ఎలా ఉన్నా నిత్యావసర వస్తువుల ధరలు, రైల్వే ఛార్జీలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపుపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి. సమావేశాల ఆరంభం నుంచే సభ వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇరాక్‌లో భారతీయుల బంది, తమిళ జాలర్ల దుస్థితి, భారత్‌పై అమెరికా నిఘా, కాశ్మీర్‌పై పాకిస్థాన్ చేసిన వివాదాస్పద ప్రకటన మొదలైన అంశాలు పార్లమెంట్‌లో దుమారం రేపనున్నాయి. పోలవరం ఆర్డినెన్స్‌పై కేంద్ర హోంమంత్రి సభలో బిల్లు ప్రవేశపెడితే దానిని అడ్డుకోవడానికి తెలంగాణకు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. అలాగే, పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదాను కోల్పోయిన కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలను రెచ్చగొట్టి సభలో గందరగోళం సృష్టించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో జరుగుతున్న మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశాలు ఉన్నాయి.