జాతికోసం జీవించిన నేత జగ్జీవన్‌రామ్
ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ ఘన నివాళి
హైదరాబాద్, జూలై 6 (జనంసాక్షి) :
మాజీ ఉపప్రధాని, సీనియర్ పార్లమెంటేరియన్ బాబూ జగ్జీవన్‌రామ్ జాతికోసం జీవించిన నేత అని ఉప ముఖ్యమంత్రులు డాక్టర్ తాటికొండ రాజయ్య, మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఆదివారం ఆయన వర్ధంతి సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేందుకు ఆంగ్లేయులతో పోరాడిన జగ్జీవన్‌రామ్ స్వాతంత్య్రం సిద్ధించాక అణగారిన వార్గలకు సామాజిక న్యాయం అందేందుకు, దేశం ఆర్థికంగా పరిపుష్టం అయ్యేందుకు ఎనలేని సేవలందించారని అన్నారు. ఆయన ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే నేత అని, నూతన ప్రజాస్వామిక విధానాన్ని ఉద్బోధించి అందరికీ ఆదర్శప్రాయమయ్యారని తెలిపారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన ధీరుడని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని కోరారు.