సర్పంచ్‌ నుంచి సీఎం వరకు శ్రమించాలి

5

బంగారు తెలంగాణ నిర్మించాలి

‘స్థానిక’ ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ ఉద్బోధ

హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) :

ఆరు దశాబ్దాలు పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సార్థకం కావాలంటే గ్రామ సర్పంచు మొదలుకొని ముఖ్యమంత్రి వరకు అందరూ కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఉద్బోధించారు. వరంగల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌్‌ గద్దల పద్మ, వైస్‌ చైర్మన్‌ చెట్టుపల్లి మురళీధర్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్‌ అధ్యక్షులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే, ప్రజలందరి కలలు సాకారం కావాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రజల పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణాను సుసంపన్నం చేసుకోవాలని, ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు. బంగారు తెలంగాణ మనందరి స్వప్నమని దాన్ని సాధించుకునే దిశగా ప్రతిఒక్కరూ ముందడుగు వేయాలని సూచించారు. గ్రామ, మండలాలు, జిల్లా స్థాయిలో అభివృద్ధిలో స్థానిక సంస్థలు తమ అధికారాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వపరంగా చేయూతనిస్తామని అన్నారు. తెలంగాణాను రాబోయే ఐదేళ్లలో అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అనంతరం కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తులా ఉమ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రజలు ఏ విశ్వాసంతో పదవిని కట్టబెట్టారో దాన్ని నెరవేరుస్తానని, నీతి, నిజాయితీతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఉమ తెలిపారు.