హైదరాబాద్‌ దురాక్రమణకు కుట్ర

1

రాజీపడే ప్రసక్తే లేదు : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, జూలై 7 (జనంసాక్షి) :

హైదరాబాద్‌ దురాక్రమణకు ఏపీ సీఎం చంద్రబాబు అండతో సీమాంధ్ర పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రెండు రాష్ట్రాలకు తాత్కాలికంగా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ నగరంపై సర్వాధికారాలు తమవేనని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌పై పెత్తనం కోసం కొందరు చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొడతామని ఆయన అన్నారు. హైదరాబాద్‌ పై చంద్రబాబు లేఖ రాయడాన్ని ఆయన దుయ్యబట్టారు. శాంతి భద్రతల అంశం ముమ్మాటికీ రాష్ట్రానికి సంబంధించినదేనని, దాన్ని దురాక్రమిస్తే సహించబోమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా నిన్న మొన్నటి వరకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే ఉన్నందున ఆయన రాష్ట్రాల అధికారాల విషయాన్ని గుర్తించాలని చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్‌ అధికారాల విషయంలో తమకు ఇబ్బందులు సృష్టిస్తే చట్టపరంగా ఎదుర్కొంటామని ఆయన అన్నారు. ఇక ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ అతిథి అని, ఆయన హైదరాబాద్‌లో నిరభ్యంతరంగా ఉండొచ్చని కేటీఆర్‌ తెలిపారు. అయితే గురుకుల భూముల్లో చంద్రబాబుకు ఎవరైనా బినామీలున్నారా, అక్కడ అక్రమ నిర్మాణాలు కూలిస్తే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి చంద్రబాబు మాటిమాటికి లేఖలు రాయడం సరికాదన్నారు. మా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాంతి భద్రతలు హరించే విధంగా కేంద్రానికి లేఖలు రాయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. లా అండ్‌ ఆర్డర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనివేని గుర్తు చేశారు. మా హక్కులు హరించే విధంగా ఎవరు ప్రయత్నించినా సహించేది లేదన్నారు. హైదరాబాద్‌కు చంద్రబాబు పదేళ్లపాటు గెస్ట్‌ మాత్రమేనన్నారు. పాత ఏపీ సీఎం అన్న ఊహల్లో చంద్రబాబు బతుకుతున్నాడేమోనని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేవిధంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. తెలంగాణ భూములు ఎవరూ కబ్జా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. దీనిపై ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు.