పోలవరం బిల్లు ఆగింది

2

ఆర్డినెన్స్‌ రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లింది

ఎంపీ వినోద్‌కుమార్‌

న్యూఢిల్లీ, జూలై 7 (జనంసాక్షి) :

పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో విలీనం చేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ పార్లమెంట్‌ ముందుకు రాకుండా ఆగింది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లిందని, ఆయన ఆమోద ముద్ర కోసం బిల్లును కేంద్రం ఉపసంహరించుకుందని కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ తెలిపారు. పోలవరం ఆర్డినెన్స్‌పై లోక్‌సభ బిజినెస్‌ రూల్‌ 72 ప్రకారం నోటీస్‌ ఇచ్చామని ఎంపీ వినోద్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే ఇరు రాష్ట్రాల శాసనసభల అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. పోలవరం ఆర్డినెన్స్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరన్నారు. సోమవారం పార్లమెంట్‌ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాలను ఆంధప్రదేశ్‌లో కలిపితే అక్కడి గిరిజనులు తెలంగాణతో సంబంధాలు కోల్పోతారన్న సమస్యను లేవనెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినోద్‌ చెప్పారు. సీమాంధ్రుల ఒత్తిడికి కేంద్రం తలొగ్గుతున్నదని ఎంపీ ప్రొఫెసర్‌ సీతారాంనాయక్‌ ఆరోపించారు. పోలవరంపై టీఆర్‌ఎస్‌ ఇచ్చిన నోటీసుతో కేంద్రం వెనక్కి తగ్గిందని చెప్పారు. త్వరలో దీనిపై రాష్ట్రపతిని కలిసి పరిస్థితి వివరిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను వదులుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇదిలావుంటే ఆంధప్రదేశ్‌  పునర్విభజన సవరణల బిల్లును వాయిదా వేయాలని ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ఖమ్మంలోని 7 మండలాలను ఏపీలో కలుపుతూ రూపొందిన బిల్లును వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌ నోటీస్‌ ఇచ్చింది. తెలంగాణ సరిహద్దులు మార్చడాన్ని టీఆర్‌ఎస్‌ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఒక రాష్ట్రం సరిహద్దులు మార్చాలంటే ఆయా ప్రభుత్వాల శాసనసభలకు పంపాలన్నది టీఆర్‌ఎస్‌ వాదన. ఈ నేపధ్యంలో సవరణ బిల్లును వాయిదా వేయాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించకపోవడంతో బిల్లును మరోరోజు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ¬మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పీకర్‌ అనుమతి కోరినట్లు తెలుస్తోంది.