నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ
వారంలోగా అడ్వయిజరీ కమిటీ : ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, జూలై 7 (జనంసాక్షి) :
నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. వారంలోగా తెలంగాణ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో అన్నివర్గాల ప్రముఖులకు స్థానం కల్పిస్తామని అన్నారు. అవినీతిని సహించే ప్రసక్తే లేదని, హైదరాబాద్‌లో 52 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. వాటిని కచ్చితంగా తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవినీతికి పాల్పడినవారిని జైళ్లకు పంపాలని కేసీఆర్ అన్నారు. కాగా కేబినెట్ విస్తరణ ద్వారా మరో ఆరుగురుకి తన టీమ్‌లో చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. విత్తనాభివృద్ధికి అత్యంత అనువైన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రతిరైతు భూమిని ప్రభుత్వమే పరీక్షించి కంప్యూటరీకరిస్తుందన్నారు. రైతులకు మార్కెట్ సదుపాయాలు కల్పిస్తామని, వ్యవసాయ పరిశోధనాకేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. మెదక్‌లో చక్కెర పరిశోధనా కేంద్రం, నిజామాబాద్‌లో పసుపు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణా- గోదావరి నీటిలో తెలంగాణ వాటా 1200 టీఎంసీలని, ఉమ్మడి రాష్ట్రంలోనే నీటి కేటాయింపుల ఉత్తర్వులు ఉన్నాయన్నారు. మైనర్ ఇరిగేషన్ అభివృద్ధి యుద్ధ ప్రాతిపదికన జరగాల్సి ఉందన్నారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో 100 కోట్ల మొక్కలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే హెచ్‌ఎండీఏ పరిధలో 10 కోట్ల మొక్కలు నాటుతాంమన్నారు. హైదరాబాద్‌ను తెలంగాణకు ఆర్థిక వెన్నెముకగా తయారు చేస్తామని వివరించారు. ఐటీఐఆర్ పూర్తయితే హైదరాబాద్ మూడింతలుగా విస్తరిస్తుంది. అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తయారుచేస్తాం. అక్రమాలు, అరాచకాలకు హైదరాబాద్ సహా తెలంగాణలో తావుండదు. అధికారులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదు. ప్రతిగ్రామానికీ డంపింగ్ యార్డు, శ్మశానవాటిక ఏర్పాటు చేస్తామన్నారు.