తెలంగాణాలో పెట్టుబడులకు అనిల్ అంబానీ ఆసక్తి
రండి.. నూతన పారిశ్రామిక విధానం ప్రకటిస్తున్నాం : కేసీఆర్
హైదరాబాద్, జూలై 7 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. మౌలిక సదుపాయలు, విద్యుత్, మీడియా తదితర రంగాల్లో పెట్టుబడి పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తాము భాగస్వాములమవుతామని, తమవంతు పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తోందని, నూతన పారిశ్రామిక విధానం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే పారిశ్రామిక విధానానికి తుది రూపు వస్తుందని, అది పూర్తయిన తర్వాత మరోసారి చర్చిద్దామని కేసీఆర్ అంబానీకి తెలిపారు. తెలంగాణాలో పరిశ్రమల స్థాపన కోసం 2.30 లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందని కేసీఆర్ తెలిపారు. పారిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనువైన ప్రాంతమని తెలిపారు.