ఆర్డీఎస్‌ పనులు అడ్డుకోవడం ముమ్మాటికీ సీమాంధ్రుల కుట్రే

1

ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పనుల్ని ఎలా అడ్డుకుంటారు? : మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి) :

రాజోలిబండ డైవర్షన్‌ స్కీం ఆర్డీఎస్‌  గేట్ల ఎత్తు పెంపును ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని భారీ నీటిపారుదల శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గేట్ల ఎత్తు పెంపుపై ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు దానిని అడ్డుకోవడమెందుకని ప్రశ్నించారు. నిర్మాణ పనులు పూర్తి చేసి తెలంగాణకు 15.9 టీఎంసీల నీటిని తెలంగాణకు ఇవ్వాలన్నారు. ఈ విషయంపై ఆంధప్రదేశ్‌ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కూడా మాట్లాడానని చెప్పారు. సీడబ్య్లూసీ జోక్యం చేసుకోని సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను మొహరించైనా సరే ఈ పనులు పూర్తిచేయించాలని హరీశ్‌రావు కోరారు. ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుపైన మంత్రి హరీష్‌ రావు  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండు కళ్ల సిద్ధాంతమని చెప్పే చంద్రబాబు ఆర్డీఎస్‌ పనులను అడ్డుకోకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ పైన ప్రేమ ఉంటే పోలీసుల భద్రతతో ఆర్డీఎస్‌ పనులను జరిపించాలన్నారు. ఆర్డీఎస్‌ పనులు ఆపేస్తుంటే.. చూస్తుండటమే బాబు రెండు కళ్ల సిద్ధాంతమా అని ప్రశ్నించారు. ఆర్డీఎస్‌ పనులు అడ్డుకోకుండా చూడాలని తాము కేంద్ర జలవనరుల సంఘాన్ని కోరామని చెప్పారు. అలాగే ఆంధప్రదేశ్‌ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, కర్ణాటక మంత్రులతో మట్లాడినట్లు చెప్పారు. నిపుణుల నివేదికల మేరకు మేరకు ఆర్డీఎస్‌ పనులు జరుగుతున్నాయన్నారు. అలాంటి వాటిని అడ్డుకోవడం సరికాదన్నారు. వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత తిక్కారెడ్డి ఆర్డీఎస్‌ పనులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇదిలావుంటే సమైక్య రాష్ట్రంలో పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోయిందని  హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్‌ నుంచి పాలమూరు జిల్లాకు రావాల్సిన నీటిని ఏపీ ప్రభుత్వం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. పాలమూరు జిల్లాకు రావాల్సిన న్యాయమైన నీటి వాటాను చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రెండు కళ్లు సీమాంధ్ర వైపే ఉన్నాయని ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లా ప్రజలు ఇప్పటికే నష్టపోయారని ఇక నుంచి నష్టం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఉంటే ఆర్డీఎస్‌ పనులు జరిగేలా చూడాలన్నారు. కేంద్ర బలగాలను మోహరించైనా సరే ఆర్డీఎస్‌ పనులను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు.