పోలవరం ఆపండి

2

లోక్‌సభలో నిలదీసిన తెలంగాణ ఎంపీలు

ఆర్టికల్‌ 3 ప్రకారం పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం

కొత్త రాష్ట్రాల రూపురేఖలు మార్చాలంటే రాష్ట్రపతి ఆమోదం కావాలి

ఆ బిల్లుపై రెండు రాష్ట్రాల సభ్యుల వ్యూస్‌ తీసుకోవాలి

లోక్‌సభ నేటికి వాయిదా

న్యూఢిల్లీ, జూలై 8 (జనంసాక్షి) :

పోలవరం ముంపు గ్రామాల పేరుతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపే చర్యను ఉప సంహరించుకోవాలని తెలంగాణ ఎంపీలు మంగళవారం లోక్‌సభలో డిమాండ్‌ చేశారు. పోలవరం ఆర్డినెన్స్‌పై లోక్‌సభ దద్దరల్లింది. ఆంధప్రదేశ్‌ పునర్విభజన బిల్లుపై లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీ పునర్విభజన బిల్లులో సవరణలు, పోలవరం ముంపు మండలాలపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసనకు దిగారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్‌ తేవడం చట్ట విరుద్ధమని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్‌ అంశాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీల్లో చర్చించాల్సి ఉందని, చర్చ తర్వాతే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని వినోద్‌ అన్నారు. రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌-3 ప్రకారం వ్యవహరించాలని, సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీలో ఈ విషయమై చర్చ జరగాలని అన్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్రపతి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ఎలా అంగీకరించారో అర్థం కావడంలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అభిప్రాయం తీసుకోకుండా ఆర్డినెన్స్‌ ఎలా తెస్తారని ఆయన ప్రశ్నించారు. ఓ దశలో  టీఆర్‌ఎస్‌ ఎంపీలు స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకు వెళ్లి జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపీలకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఎంపీలు మద్దతు తెలిపారు. దాంతో సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య సభ మధ్యాహ్నం మూడున్నర వరకూ వాయిదా పడింది. రాష్ట్రపతిని కలిసి ఈ విషయంపై పునరాలోచన చేయాలని కోరతామన్నారు. తెలంగాణ అసెంబ్లీలో చర్చించకుండా ఎలా ముందుకు తీసుకుని వెళతారని ఎంపీ కవిత ప్రశ్నించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రైల్వే బడ్జెట్‌ దేశ ప్రజలను నిరాశ పరిచిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ తెలంగాణకు ఏ మాత్రం ఆశాజనకంగా లేదన్నారు. తెలంగాణకు కొత్త లైన్లను ప్రకటించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలో లేని అంశాలను సవరణల ద్వారా తేచ్చేందుకు కుట్ర పన్నడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఎంపీల అభిప్రాయాలు తీసుకోకుండా చర్యలకు ఉపక్రమించవద్దని డిమాండ్‌ చేశారు. ఎంపీలు పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనలు కొనసాగిస్తుండటంతో ప్రొటెం స్పీకర్‌ను సభను బుధవారానికి వాయిదా వేశారు.