కరెంట్ కష్టాలపై కేసీఆర్ నజర్
4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు సమాలోచన
ఎన్టీపీసీ సీఎండీతో సమావేశం
39 నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తాం : సీఎండీ అరూప్‌రాయ్
హైదరాబాద్, జూలై 8 (జనంసాక్షి) :
తెలంగాణలో కరెంటు కష్టాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టిసారించారు. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆయన సమాలోచనలు జరిపారు. ఈమేరకు ఎన్టీపీసీ చైర్మన్ అరూప్‌రాయ్ చౌదరి మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రామగుండంలో 4 వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఎన్టీపీసీ చైర్మన్ అంగీకరించారు. దీనికి సంబంధించి విధివిధానాలు తర్వాత వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదిలావుంటే విద్యుత్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎన్టీపీసీ సీఎండీ అరూప్‌రాయ్, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో విద్యుత్ సమస్యతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు విషయంపై చర్చించారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు కొత్త ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందన్నారు. వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే విద్యుత్ కొనుగోళ్లను చేపడతామన్నారు. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఎన్టీపీసీ కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సిఎం కోరారు. దీంతో రమగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అరూప్ రాయ్ అంగీకరించారు.