తెలంగాణ గోడు వినని గౌడ

4

మళ్లీ అదే తీరు

కొత్త రాష్ట్రానికి తీరని అన్యాయం

కాంగ్రెస్‌ దారిలోనే భాజపా

ఈ బడ్జెట్‌ తెలంగాణాకు అన్యాయం : సీఎం కేసీఆర్‌

న్యూఢిల్లీ, జూలై 8 (జనంసాక్షి) :

ప్రధాని నరేంద్రమోడీకి మళ్లే రైల్వే మంత్రి సదానందగౌడ కూడా తెలంగాణ గోడు వినలేదు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణాకు మళ్లీ నిరాశే ఎదురైంది. పెండింగ్‌ ప్రాజెక్టులకు మోక్షం లభించలేదు. కొత్త రాష్ట్రాలకు పూర్తిగా సహకారం అందిస్తామన్న హామీ తప్ప రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు పెద్దగా దక్కిందేమీ లేదు. కాజీపేటలో వ్యాగన్‌ ఫ్యాక్టరీ, కొత్త ప్రాజెక్టులు, కొత్త రైళ్లు, నూతన లైన్ల సర్వేలపై బడ్జెట్‌లో స్పందన లభించలేదు. మంగళవారం లోక్‌సభలో రైల్వే మంత్రి సదానందగౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు దక్కింది నామమాత్రమే. గౌడపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండు రాష్ట్రాల ప్రజలకు మళ్లీ నిరాశే మిగిలింది. రెండు రాష్ట్రాల్లో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న హామీతో సరిపుచ్చారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రైల్వేల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు గౌడ తెలిపారు. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని.. నూతన ప్రాజెక్టుల స్థాపనపై కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రాష్ట్రాలలోని 29 పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి రూ.20,680 కోట్లు అవసరమని.. ఆ మేరకు నిధులు కేటాయిస్తామన్నారు. హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌-2కు ఊసే ఎత్తలేదు. ఎంఎంటీఎస్‌ రెండో దశకు నిధులపై నోరు మెదపలేదు. సికింద్రాబాద్‌- సిద్దిపేట-కరీంనగర్‌, పాండురంగాపురం-భద్రచలం, దర్శి-నర్సరావుపేట, కదిరి-పుట్టపర్తి, నర్సాపురం-మచిలీపట్నం మధ్య రైల్వే మార్గాలను పట్టించుకోలేదు. అయితే, కొన్ని కొత్త రైళ్లను కేటాయించారు. నాగపూర్‌-సికింద్రాబాద్‌, చైన్నై-హైదరాబాద్‌ మధ్య సెమీ బుల్లెట్‌ రైలు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే, సికింద్రాబాద్‌-హజ్రత్‌ నిజాముద్దీన్‌ మధ్య ప్రీమియం రైలు, పారాదీప్‌-విశాఖ డెయిలీ ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ-ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. విశాఖ-చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ నడుపుతామన్నారు.

రైల్వేబడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకు అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలాగే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణకు ఒక్క కొత్త రైల్వే ప్రాజెక్టు కూడా కేటాయించలేదని ఆయన మండిపడ్డారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ, కాజీపేట రైల్వే డివిజన్‌, వ్యాగన్‌ ఫ్యాక్టరీ ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. కనీసం రెండు సర్వేలు పూర్తి చేసిన ప్రాజెక్టులకైనా నిధులు కేటాయించడలేదని అన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశకు రూ.20 కోట్లు కేటాయించడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతోందని అన్నారు.

రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరగలేదని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కొత్త ప్రాజెక్టులు, నూతన రైళ్లు, లైన్ల ఏర్పాటులో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై గుత్తా పెదవి విరిచారు. ఎన్డీఏ రైల్వే బడ్జెట్‌ను రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేసే విధంగా ఉందని విమర్శించారు. కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు జోనల్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా తేలేదన్నారు. ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల కోసం ఎలాంటి ప్రతిపాదనలు తీసుకురాకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.