భాజపా దళపతిగా అమిత్‌ షా

1

బాధ్యతలు అప్పగించిన రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి) :

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌ షా నియమితులయ్యారు. అతిపిన్న వయస్సు (50)లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా షా రికార్డు సృష్టించారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం అమిత్‌ షాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు పార్టీ అధ్యక్షుడు, కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధికారికంగా ప్రకటించారు. బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తన వారసుడిగా షా పేరును ప్రకటించారు. పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అగ్రనేత ఎల్‌కే అద్వానీ సమక్షంలో రాజ్‌నాథ్‌ ఈ ప్రకటన చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కీలక విజయం సాధించడంలో షా పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. ఆయన వ్యూహ చతురత అమోఘమని ప్రశంసించారు. అందువల్లే తాము యూపీలో క్లీన్‌స్వీప్‌ చేయగలిగామన్నారు. యూపీలో చూపించిన అద్భుత ప్రతిభ కారణంగానే షాను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో నితిన్‌ గడ్కారీ రాజీనామా తర్వాత తాను పార్టీ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందని గుర్తు చేసిన రాజ్‌నాథ్‌ ఇప్పుడు తనకు మంత్రి పదవి రావడంతో ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండకూడదన్న నియమం మేరకు తప్పుకొంటున్నట్లు చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికైన షాను రాజ్‌నాథ్‌, మోడీ, అద్వానీ, మురళీమనోహర్‌ జోషి, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌ అభినందించారు.

ఏకగ్రీవంగా ఎన్నిక

ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు పార్టీ సీనియర్‌ నేతలు షా పేరుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో రాజ్‌నాథ్‌ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న పార్టీ సిద్ధాంతాల మేరకు రాజ్‌నాథ్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఆయన వారసుడిగా షాకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్‌ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతలు షాకు అప్పగించారు. జేపీ నడ్డాకు అధ్యక్ష పదవి అప్పగిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, మోడీ అండదండలు పుష్కలంగా ఉన్న షా వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది. ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు ఒకే రాష్టాన్రికి చెందిన వారు కావడం గమనార్హం.

వివాదాస్పద నేతగా..

వాస్తవానికి అధ్యక్షుడిగా షా పేరును ఇప్పుడే ప్రకటించరని ప్రచారం జరిగింది. పలు కేసులలో అభియోగాలు ఎదుర్కొంటుండడమే ఇందుకు కారణం. గుజరాత్‌ ¬ం మంత్రిగా మోడీ నాయకత్వంలో పని చేసిన షా.. సోహ్రబుద్దీన్‌, కౌసర్‌ బాయి, ప్రజాపతి నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులలో నిందితుడిగా ఉన్నారు. ఈ మూడు కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ నెలలోనే ఈ కేసులు విచారణకు రానున్నాయి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు షా పేరును అధ్యక్షుడిగా ప్రకటించాలని బీజేపీ యోచించింది. ఇష్రాత్‌ జహన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఇప్పటికే సీబీఐ ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

కింది నుంచి ఎదిగిన షా..

ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన షా అకుంఠిత దీక్ష, రాజకీయ చతురతతో కింది స్థాయి నుంచి ఎదిగారు. సాధారణ కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం వెనుక ఆయన కఠోర సాధన ఉంది. ప్రత్యర్థులకు చిక్కకుండా వ్యూహాలను రచించడంలో షా దిట్ట. అందుకే ములాయంసింగ్‌ యాదవ్‌, మాయావతి వంటి అతిరథ మహారథులు ఉన్న ఉత్తరప్రదేశ్‌లోనూ పార్టీని ఒంటిచేత్తో గెలిపించారు. గుజరాత్‌లో బీజేపీ వరుస విజయాల వెనుక కూడా ఆయన పాత్ర కీలకం. వ్యాపార కుటుంబంలో జన్మించిన షా రాజకీయ జీవితం ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవక్‌గా ప్రారంభమైంది. 1980లలో ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్న సమయంలోనే మోడీతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 1986లో పార్టీలో చేరిన షా 1997లో జరిగిన సర్కేజ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. మోడీ సర్కారులో ¬ం మంత్రిగా పని చేశారు.