తీరుమారని చంద్రబాబు

2

ఆ లేఖ నేనే రాశా

హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణకు గవర్నర్‌కు అధికారాలుండాల్సిందే

హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) :

రెండు కళ్ల చంద్రబాబు తీరుమారలేదు. తెలంగాణ, ఆంధ్ర తనకు రెండు కళ్లని చెప్పే బాబు తన చూపంతా ఏపీపైనే ఉందని స్పష్టం చేశాడు. అందుకే హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టాలని కోరుతూ కేంద్రానికి తానే లేఖ రాసానని గొప్పలు చెప్పుకున్నాడు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణకు గవర్నర్‌కు అధికారాలుండాలని లేఖలో కోరానన్నారు. బుధవారం ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన బాబు తెలంగాణపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. 1956 నాటికి ఉన్నవారికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింప చేయాలన్నదానిపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని చట్టాలు,రాజ్యాంగాలు ఉన్నాయని, వాటితో సంబంధం లేకుండా ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆమెరికాలో నిర్దిష్టకాలం జీవిస్తే గ్రీన్‌ కార్డు ఇస్తున్నారని ,ఇక్కడ తెలుగువారు అంతా ఒకటి కాదా అని ఆయన అన్నారు. హైదరాబాద్‌ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని, ప్రత్యేక రాష్ట్రం చేయాలని అప్పట్లో కొందరు కోరారని, ఆ నేపధ్యంలో అప్పట్లోనే బిల్లులో హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అమలుకు గవర్నర్‌కు బాధ్యత అప్పగించారని చంద్రబాబు అన్నారు. ఇద్దరం కలిసి పనిచేద్దామని అన్నా, తెలంగాణ వైపు నుంచి స్పందన రావడం లేదంటూ నిష్టూరమాడారు. అన్ని అంశాలే తానే స్వయంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కూడా చంద్రబాబు అనేక అంశాల్లో తప్పుడు సమాచారం చెప్తూ ప్రజలను మోసగించే ప్రయత్నమే చేశారు. తెలంగాణ రాష్ట్ర అధికారాలను హరించేందుకు గవర్నర్‌కు అధికారాలివ్వాలంటూ లేఖ రాశానని నిస్సిగ్గుగా చెప్పుకున్నాడు.