అగస్టా కేసులో గవర్నర్‌ను ప్రశ్నించిన సీబీఐ
హైదరాబాద్, జూలై 9 (జనంసాక్షి) :
అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం ప్రశ్నించింది. దాదాపు గంటన్నర పాటు ఈ విచారణ సాగింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సీబీఐ ప్రత్యేక అధికారుల బృందం ఉదయమే రాజ్‌భవన్‌కు చేరుకుంది. నరసింహన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. హెలికాప్టర్ కొనుగోలుకు సంబంధించి 2005 మార్చి 1న జరిగిన సమావేశంలో ఏం జరిగిందనే దానిపై సీబీఐ అధికారులు గవర్నర్‌ను ఆరా తీశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో ఆయనను సాక్షిగా విచారించింది. ఐపీసీ సెక్షన్ 161 (ఎ) ప్రకారం నరసింహన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. చాపర్ల కొనుగోలుకు సంబంధించిన సమయంలో నరసింహన్ ఇంటెలిజిన్స్ బ్యూరో చీఫ్‌గా ఉన్నారు. అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీకి చాపర్ల కొనుగోలు కాంట్రాక్ట్‌ను కట్టబెట్టే ఉద్దేశ్యంతో హెలికాప్టర్లు ఎగిరే ఎత్తు సామర్థ్యాన్ని 6 వేల నుంచి 4500 అడుగుల ఎత్తకు తగ్గిస్తూ 2005 మార్చి 1న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో అప్పటి జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చీఫ్ బీవీ వాంఛూ, నాటి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నరసింహన్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ నారాయణన్, వాంఛూలను ప్రశ్నించింది. తాజాగా నరసింహన్‌ను కూడా ప్రశ్నించింది. నాటి సమావేశంలో ఏం జరిగిందనే దానిపై వాంగ్మూలం నమోదు చేసింది. చాపర్ సామర్థ్యాన్ని తగ్గించడానికి గల కారణాలపై నరసంహన్ కీలక వివరాలు చెప్పినట్లు తెలిసింది. రూ.3600 కోట్ల విలువైన హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి సుమారు రూ.360 కోట్లకు పైగా చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో పశ్చిమబెంగాల్, గోవా గవర్నర్లు ఎంకే నారాయణన్, వాంఛూలను ప్రశ్నించింది. సీబీఐ విచారణ నేపథ్యంలో వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా సీబీఐ నరసింహన్‌ను ప్రశ్నించిన నేపథ్యంలో ఏం జరుగుతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన రాజీనామా చేస్తారా లేక పదవిలో కొనసాగుతారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను తప్పుకోవాలని కేంద్రం ఇప్పటికే ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే మిగతా వారితో పాటు నారాయణన్, వాంఛూలు రాజీనామా చేశారు. యూపీఏ హయాంలోనే నియమితులైన నరసింహన్ కూడా తప్పుకొనే అవకాశమున్నట్లు సమాచారం. హెలికాప్టర్ల కుంభకోణం కేసులో సీబీఐ ఇప్పటికే పలు కేసులు నమోదు చేసింది. ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగితో పాటు మరో 13 మందిని నిందితులుగా పేర్కొంది.